
భార్యపై ప్రేమ ఉన్నవారు ప్రెస్టేజ్ కుక్కర్ ను ఎలా కాదనగలరు.. భారతదేశంలో ధనవంతుల నుంచి అట్టడుగు పేదల ఇంట్లో కూడా ప్రెషర్ కుక్కర్ ను అందుబాటులోకి తెచ్చిన.. వంటింట్లో ప్రెషర్ కుక్కర్ లేకపోతే వంట ఎలా చేయటం అనే స్థాయికి మహిళలను తీసుకెళ్లిన ఘనుడు.. ఘనాపాటి.. మార్గదర్శకుడు.. ప్రెస్టేజ్ బ్రాండ్ క్రియేటర్ టీటీ జగన్నాథన్ కన్నుమూశారు.
టీటీకే గ్రూప్ చైర్మన్ అండ్ ప్రెస్‌టీజ్ బ్రాండ్ సృష్టికర్త టీటీ జగన్నాథన్ గురువారం అంటే అక్టోబర్ 9న బెంగళూరులో మరణించారు. ఆయన భారతదేశపు గొప్ప వ్యాపార నాయకులలో ఒకరు. ఆయన కొత్త ఆలోచనలు, పట్టుదలతో దేశంలోని వంటగది సామాన్ల పరిశ్రమ రూపాన్ని మార్చారు.
జగన్నాథన్ గ్యాస్ కెట్ రిలీజ్ సిస్టమ్ అనే కొత్త విధానాన్ని పరిచయం చేసి ప్రెషర్ కుక్కర్ మార్కెట్‌లో విప్లవం తెచ్చారు. ఈ ఆవిష్కరణతో ప్రజల్లో కుక్కర్లపై నమ్మకం పెరిగింది. అలాగే ప్రెస్‌టీజ్ బ్రాండ్ భారతదేశంలోని ప్రతి ఇంట్లో వినిపించేలా చేసింది.
జగన్నాథన్ కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి ఆపరేషన్స్ రీసెర్చ్‌లో పీహెచ్‌డీ చేశారు, ఐఐటీ మద్రాస్ నుండి మెడల్ కూడా అందుకున్నారు. ఆయనకు చదువుతో పాటు గొప్ప వ్యాపార దృష్టి కూడా ఉంది.
టీటీకే ప్రెస్‌టీజ్ బోర్డులో ఐదు దశాబ్దాలు అంటే యాభై సంవత్సరాలు పనిచేసిన కాలంలో కంపెనీ దాదాపు దివాలా తీసిన అంటే ఒక విధంగా పూర్తిగా నష్టపోయిన క్లిష్ట సమయాలతో సహా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా ఆయన కంపెనీని చివరికి అప్పులు లేని, కోట్ల కంపెనీగా మార్చారు.
"హౌ టిటికె ప్రెస్టీజ్ బికేమ్ ఎ బిలియన్ డాలర్" కంపెనీ అనే పుస్తకాన్ని కూడా అయన రాశారు. ఈ పుస్తకంలో 1990లలో కంపెనీ ఎన్నో కష్టాలు పడి, నష్టాల కారణంగా దాదాపు దివాలా తీయడానికి ఎలా జరిగిందో వివరించారు.
కంపెనీ వ్యాపారమైన వంటగది ఉపకరణాలపై దృష్టి పెట్టి, ఖర్చులను తగ్గించుకుని ప్రెషర్ కుక్కర్ వంటి కొత్త ఉత్పత్తులతో ముందుకు రావడం ద్వారా ఎలా తిరిగి నిలదొక్కుకుందో ఆయన తెలిపారు. ఈ చర్యల ఫలితంగానే, టీటీకే ప్రెస్‌టీజ్ అప్పులు లేని కంపెనీగా మారి, కోట్ల కంపెనీగా ఎదిగింది.
కంపెనీ సహోద్యోగులు, పరిశ్రమలోని పెద్దలు ఆయనను ఒక గొప్ప వ్యాపారవేత్తగా, కార్పొరేట్ దిగ్గజంగా కాకుండా, ఆధునిక భారతీయ వంటగది అవసరాలను వ్యక్తిగతంగా అర్థం చేసుకున్న వంటవాడిగా కూడా గుర్తుంచుకున్నారు.