శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. జనవరి 2 న వైకుంఠ ఏకదాశి సందర్భంగా తిరుమంజనం  నిర్వహించింది. ఏడాదిలో నాలుగు సార్లు తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకదాశి పర్వదినాల ముందు మంగళవారం శ్రీవారి ప్రధాన ఆలయాన్ని శుద్ది చేస్తారు. తిరుమంజనం సందర్భంగా వీఐపీ దర్శనాలు రద్దు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి శ్రీవారి దర్శనానికి అనుమతిచ్చారు.

ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల, టెంపుల్ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రిని నీటితో శుభ్రంగా కడిగారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్ ను వస్త్రంతో పూర్తిగా కప్పారు. శుద్ధి తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పోడి, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో  ఆలయమంతటా చల్లారు. తర్వాత స్వామివారి మూలవిరాట్ కు కప్పిన  వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమం తర్వాతే భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు.

మరోవైపు వైకుంఠ ఏకాదశి కోసం ఆన్ లైన్లో ఇప్పటికే 2 లక్షల 20 వేల టికెట్లను విడుదల చేశామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. టైం స్లాట్ విధానంతో  భక్తులు క్యూలో గంటల తరబడి నిలబడే పరిస్థితి ఉండదన్నారు. తిరుపతి కేంద్రంగా సర్వదర్శనం కోసం టోకెన్ల జారీ కోసం 9 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. జనవరి 1న సర్వదర్శనం టోకెన్లు పంపిణీ చేస్తామన్నారు.