తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు : ఏర్పాట్లపై అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు : ఏర్పాట్లపై అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష

కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై గురువారం ( జులై 10 ) సమీక్ష నిర్వహించారు టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి. ఈ సమీక్షా సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు వెంకయ్య చౌదరి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు వెంకయ్య చౌదరి.

బ్రహ్మోత్సవాల వివరాలు:

  • సెప్టెంబర్ 16 : కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
  • సెప్టెంబర్ 23: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
  • సెప్టెంబర్ 24: ధ్వజారోహణం.
  • సెప్టెంబర్ 28: గరుడ వాహనం.
  • అక్టోబర్ 01: రథోత్సవం.
  • అక్టోబర్ 02 : చక్రస్నానం.

సమావేశంలోని ముఖ్యాంశాలు

ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహించాలని.. బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని.. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలు కూడా రద్దు చేయాలని ఆదేశించారు.విజిలెన్స్, పోలీసు విభాగాల సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని.. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, రోడ్ మ్యాప్ లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు వెంకయ్య చౌదరి.

భక్తులకు దర్శన క్యూలైన్లు, మాడ వీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో విరివిగా అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని.. భక్తుల అవసరాలకనుగుణంగా ఇంజనీరింగ్ పనులు చేపట్టాలని ఆదేశించారు.గ్యాలరీల్లో భక్తులకు సమస్యలు తలెత్తకుండా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు అదనపు సిబ్బందిని తీసుకోవాలని ఆదేశించారు వెంకయ్య చౌదరి. భక్తులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ అలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయాలని చెప్పారు.

శ్రీవారి సేవకులుగా యువతీ, యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని అన్నారు. సెప్టెంబర్ 27 రాత్రి 9 నుండి 29వ తేదీ ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను అనుమతించొద్దని ఆదేశించారులు.భక్తుల రద్దీకి తగినవిధంగా లడ్డూలు నిల్వ ఉంచుకోవాలని అన్నారు వెంకయ్య చౌదరి.