
కలియుగ వైకుంఠం తిరుమలలో సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. శుక్రవారం ( ఆగస్టు 22 ) బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు వసతి, ఇతర సౌకర్యాలకు సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు ఈవో శ్యామలరావు. భక్తులకు వసతి, ఇతర సౌకర్యాలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమలలోని అన్ని గదులలో ఎలక్ట్రిక్ పనులు, మరుగుదొడ్లు, ఇతర రిపేర్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. తిరుమలలోని పలు విశ్రాంతి గృహాలు, కాటేజీల మరమ్మతు పనులను రిసెప్షన్ విభాగంతో సమన్వయం చేసుకుని సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.యాత్రికుల వసతి సముదాయాల్లో కూడా సెంట్రలైజ్డ్ బుకింగ్ సిస్టమ్ అప్లికేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు శ్యామలరావు. ప్రస్తుతం తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులు వేచి ఉండే సమయం ఎక్కువగా ఉన్నందున వేరొక ప్రాంతంలో కూడా అన్న ప్రసాద భవనం ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని ఆదేశించారు.
►ALSO READ | తిరుమల ఘాట్ రోడ్డుపై కొండను ఢీకొన్న టెంపో : నలుగురు భక్తులకు గాయాలు : 4 గంటల్లో 2వ ప్రమాదం..
రాష్ట్ర ఆహార భద్రతా అధికారులతో తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో ఆహార నాణ్యత పరిశీలించాలని అన్నారు.అదేవిధంగా పంచాయతీ, రెవెన్యూ విభాగం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో ఏర్పాటు చేసిన ధరల పట్టికను పరిశీలించాలని ఆదేశించారు శ్యామలరావు.కొండపై ఉన్న హోటళ్లలో భక్తులకు సాంప్రదాయ భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తులు లడ్డూ ప్రసాదం తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రసాద విక్రయ కేంద్రంలో అన్ని కౌంటర్లు పని చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు.
ప్రతానెలా నిర్వహించే ఫీడ్ బ్యాక్ సర్వే ద్వారా వచ్చే భక్తుల అభిప్రాయాలు, సలహాలు, సూచనలను తీసుకుని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీఈ శ్రీ సత్య నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.