రివ్యూ: టక్ జగదీష్ 

రివ్యూ: టక్ జగదీష్ 

రన్ టైమ్: 2 గంటల 28 నిమిషాలు
నటీనటులు: నాని,రీతు వర్మ,ఐశ్వర్య రాజేశ్,జగపతిబాబు,తిరువీర్,నరేష్,నాజర్,రావురమేష్,ప్రవీణ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మురెళ్ల
మ్యూజిక్: తమన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: గోపీ సుందర్
నిర్మాతలు: శైన్ స్క్రీన్స్
రచన,దర్శకత్వం : శివ నిర్వాణ
రిలీజ్ డేట్: సెప్టెంబర్ 10,2021

కథేంటి?
భూదేవిపురంలో ఆదిశేషు నాయుడు (నాజర్) కి ఇద్దరు భార్యలు. మొదటి భార్య చనిపోతుంది. ఆమెకు కలిగిన సంతానం బోసు (జగపతి బాబు), జగదీష్ (నాని).  రెండవ భార్య కి ఇద్దరు కూతుళ్లు (రోహిణి, దేవదర్శని చేతన్),  ఆదిశేషు నాయుడు చనిపోవడంతో బోసు తన సవితి తల్లి పిల్లలకు ఆస్తి దక్కనీయకుండా చూస్తాడు. అదే ఊరిలో వీరేంద్ర (డేనియల్ బాలాజి) అనే విలన్ తో చేతులు కలిపుతాడు. జగదీష్ కు అది నచ్చదు. అక్కలందరినీ అక్కున చేర్చుకొని బోసు పై ఫైట్ చేస్తాడు. బోసు పేరుమీదే ఆస్తులన్నీ ఉంటాయి. మరి లీగల్ గా ఎలా పోరాడాడు. చివరకి ఆస్తి దక్కిందా? ఎలాంటి సమస్యలు ఎదర్కొంటాడు అనేది కథ.
నటీనటుల పర్ఫార్మెన్స్:
నాని జగదీష్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సినిమాను తన భుజాలపై నడిపించాడు. కాకపోతే మాస్ సినిమాల్లో లాగా సీరియస్ అటిట్యూడ్, డైలాగ్ డెలివరీ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. జగపతి బాబు ఆ రోల్ కు సూట్ అవలేదు అనిపిస్తుంది. తన పాత్ర మేరకు బాగా చేశాడు. రీతు వర్మ ఫర్వాలేదు. సింపుల్ రోల్. ఐశ్వర్య రాజేష్ కు మంచి పాత్ర దక్కింది. తన రోల్ కు న్యాయం చేసింది. డానియల్ బాలాజీ విలన్ గా వీక్ అయ్యాడు. తిరువీర్ బాగా చేశాడు. రోహిని,నరేష్,రావు రమేష్,దేవదర్శిని తదితరులు తమ పరిధి మేర నటించారు.
టెక్నికల్ వర్క్:
ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రఫీ అందంగా ఉంది. పల్లెటూరు అందాలను బాగా క్యాప్చర్ చేశాడు. తమన్ పాటలు సోసో గా ఉన్నాయి. గోపిసుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా లేదు. సీన్లను ఎలివేట్ చేయలేదు. ఆర్ట్ వర్క్,యాక్షన్ కొరియోగ్రఫీ బాగున్నాయి. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. డైలాగులు కొన్ని బాగున్నాయి.
విశ్లేషణ:
‘టక్ జగదీష్’’ రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. నిన్ను కోరి,మజిలీ లాంటి సినిమాల తర్వాత శివనిర్వాణ ఈ సినిమాను ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తీద్దామనుకున్నాడు. పాత స్టోరీ కావడంతో రొటీన్ గా అనిపస్తుంది. ట్రీట్ మెంట్ అయినా కొత్తగా ఉండాల్సింది. స్టార్టయిన కొద్ది నిమిషాలకే బోర్ కొడుతుంది. కాకపోతే నాజర్ చనిపోయిన తర్వాత కొంత గ్రిప్పింగ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా బాగా సెట్ అయింది. ట్విస్టు బాగుంది. ఇంటర్వెల్ తర్వాత కూడా గ్రిప్పింగ్ గానే సాగింది. ప్రీ క్లైమాక్స్,క్లైమాక్స్ లో పట్టు తప్పింది. దాని వల్ల సినిమా మొత్తం కథ పై ఎఫెక్ట్ పడింది. ఐశ్వర్య రాజేశ్ ను ఇంటికి తెచ్చేందుకు జగపతి బాబు ప్రయత్నం,క్లైమాక్స్ ఫైట్ అంతా ఫోర్స్ డ్ గా అనిపిస్తుంది. ముందు రెండు సినిమాలను బాగా హ్యాండిల్ చేసిన శివ నిర్వాణ ఈ సినిమా కథను, పెద్ద కాస్టింగ్ ను హ్యాండిల్ చేయలేదనిపిస్తుంది. సెకండాఫ్ లో ఎవరు ఎవరి కొడుకో,కూతురో అర్థంకాని కన్ఫ్యూజన్ నెలకొంటుంది. దీనికి కారణం సరైన డిటెయిలింగ్ ఇవ్వకపోవడమే. నాని వరకు బాగా చేశాడు. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసి మంచి పని చేశారు. ఫ్యామిలీ వరకైనా ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేస్తారు. థియేటర్లలో రిలీజ్ అయ్యుంటే మరో బ్రహ్మోత్సవం అయ్యుండేది. ఓవరాల్ గా ‘టక్ జగదీష్’’ ఊహించిన రేంజ్ లో లేదు.

బాటమ్ లైన్: టక్ నలిగిపోయింది.