చేనేత పథకాలను మళ్లీ స్టార్ట్ చేస్తం: మంత్రి తుమ్మల

చేనేత పథకాలను మళ్లీ స్టార్ట్ చేస్తం: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో  చేనేత పథకాలను మళ్లీ అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు.  సోమవారం ఆయన చేనేత సమస్యలపై సెక్రటేరియెట్‌లో పద్మశాలి సంఘం నేతలు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. చేనేత పథకాలను కొనసాగిస్తామని, ఫండ్స్ కేటాయిస్తామని తెలిపారు. కొత్త స్కీములను కూడా రూపొందిస్తామని హామీ ఇచ్చారు. చేనేత సంఘాలు ఇచ్చిన వినతులను  వీలైనంత త్వరగా  పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 

చేనేత సంఘం నేతలు మాట్లాడుతూ.. సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, గత ప్రభుత్వ పథకాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్, చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాలు మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. చేనేత మిత్ర పథకాన్ని కొనసాగిస్తూ జియో ట్యాగ్ కలిగిన ప్రతి నేత కార్మికునికి రూ. 3000, అనుబంధ కార్మికునికి రూ.2000 చొప్పున అందించాలన్నారు. నేతన్న నిధిని ఏర్పాటు చేసి మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షలు అందించాలని విన్నవించారు. పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు హౌస్ కం వర్క్ షెడ్యూల్ పథకాన్ని పునరుద్ధరించాలని పేర్కొన్నారు. సమావేశంలో అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం,  తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మచ్చ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.