
- కరూర్ తొక్కిసలాటపై ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న పోలీసులు
- వేదిక వద్దకు ముందే వచ్చినా బయటకు రాలే
- చాలాసేపు వాహనంలోనే ఉన్నాడు
- దాంతో జనం పెరిగిపోయి తొక్కిసలాట జరిగిందని వెల్లడి
- టీవీకే పార్టీ నేత జగన్ అరెస్ట్
కరూర్:తమిళనాడులోని కరూర్ జిల్లాలో ర్యాలీ సందర్భంగా టీవీకే చీఫ్ విజయ్ వ్యవహరించిన తీరు వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ‘‘విజయ్ వేదిక వద్దకు చేరుకున్నప్పటికీ, ఆయన చాలాసేపు క్యాంపెయిన్ వెహికల్‌లోపలే ఉండిపోయారు. దీంతో జన సందోహం పెరిగిపోయింది. అది తొక్కిసలాటకు దారితీసింది” అని తెలిపారు. ‘‘విజయ్‌ను దగ్గరి నుంచి చూడాలని వేలాది మంది ఆయన వెహికల్ వైపు దూసుకొచ్చారు. కొంతమంది అక్కడ వేసిన టెంపరరీ షెడ్లు, చెట్లు ఎక్కారు. షెడ్లు కూలిపోయి వాళ్లంతా కిందపడ్డారు.
ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. జనాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతోనే పోలీసులు లాఠీచార్జ్ చేశారు” అని చెప్పారు. అయితే పోలీసులు మాత్రం ఎఫ్‌ఐఆర్‌లో విజయ్ పేరు చేర్చలేదు. టీవీకే ముఖ్య నేతలు మాథిజగన్, బుస్సీ ఆనంద్, నిర్మల్ కుమార్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. వీరిలో జగన్‌ను అరెస్టు చేశారు. కాగా, తొక్కిసలాట ఘటనలో మృతి చెందినోళ్ల సంఖ్య 41కి చేరింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్న 60 ఏండ్ల మహిళ సోమవారం చనిపోయింది.
కరెంట్ ఆపాలని టీవీకేనే కోరింది: విద్యుత్ బోర్డు
కరెంట్ కట్ చేయాలని టీవీకే పార్టీ నేతలే కోరారని తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు తెలిపింది. కానీ తాము నిరాకరించామని చెప్పింది. ‘‘విజయ్ ర్యాలీలో భాగంగా వేలుసామిపురం వద్ద భారీ జన సందోహం ఉంటుంది. ప్రజల భద్రతను దృష్టిలోఉంచుకొని విజయ్ మాట్లాడే టైంలో కొంతసేపు విద్యుత్ సరఫరా నిలిపివేయండి” అని టీవీకే కోరినట్టు విద్యుత్ బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. ఆ అభ్యర్థనను తాము తిరస్కరించామన్నారు. కాగా, తొక్కిసలాట వెనుక కుట్ర కోణం ఉన్నదని, విజయ్ వేదిక వద్దకు రాగానే కరెంట్ బంజేశారని టీవీకే నేతలు ఆరోపించారు.
పుకార్లు ఆపండి: స్టాలిన్
తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని, వాటిని వెంటనే ఆపాలని సీఎం స్టాలిన్ హెచ్చరించారు. ‘‘ఇది తీవ్ర విషాదకర ఘటన. కానీ దీనిపై కొంతమంది పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. తన కార్యకర్తలు, ప్రజలు చనిపోవాలని ఏ లీడర్ కూడా కోరుకోడు. చనిపోయినోళ్లందరూ ఒక పార్టీకి చెందినోళ్లు కాదు.. వాళ్లంతా తమిళులు. ఘటన విషయం తెలియగానే నేను వెంటనే కరూర్‌కు వచ్చాను. ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించాను. ఆ దృశ్యాలు ఇంకా నా కళ్ల ముందే కదలాడుతున్నాయి.
ఇలాంటి విషాదం ఇంతకుముందెప్పుడూ జరగలేదు. దీనిపై రాజకీయాలు చేయడం సరికాదు. రాజకీయాలు పక్కనపెట్టి ప్రజల సంక్షేమం కోసం ఆలోచించండి. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి నిబంధనలు రూపొందిస్తాం. అందుకు అన్ని పార్టీలు సహకరించాలి” అని సోమవారం వీడియో మెసేజ్‌లో స్టాలిన్ పేర్కొన్నారు.