నన్నేమైనా చేయండి..మా నేతల జోలికి రావొద్దు: విజయ్

నన్నేమైనా చేయండి..మా నేతల జోలికి రావొద్దు: విజయ్
  • తొక్కిసలాట ఘటనలో మా తప్పు లేదు 
  • బాధితులను త్వరలో కలుస్తానని వెల్లడి 

చెన్నై: కరూర్‌‌‌‌లో జరిగిన తొక్కిసలాట ఘటనతో తన గుండె బద్ధలైందని టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి బాధను ఇంతకుముందెప్పుడూ అనుభవించలేదన్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయనే ఇప్పటి వరకు కరూర్‌‌‌‌కు వెళ్లలేదని పేర్కొన్నారు. త్వరలోనే అక్కడికి వెళ్లి బాధితులను కలుస్తానని తెలిపారు. 

‘‘చనిపోయినోళ్లందరూ నా మీద ప్రేమతో ర్యాలీకి వచ్చారు. నేను వాళ్లకు ఎంతో రుణపడి ఉన్నాను. నేనూ ఒక మనిషినే. అంతమంది చనిపోతే నేను ఎలా వెళ్లిపోతాను? తిరిగి రావాలని ఉంది. కానీ అది ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందని ఆగిపోయాను” అని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన మూడ్రోజుల తర్వాత విజయ్ తొలిసారి స్పందించారు. 

మంగళవారం సోషల్ మీడియాలో వీడియో మెసేజ్ పోస్టు చేశారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌‌పై విమర్శలు గుప్పించారు. ‘‘సీఎం సార్.. మీరు నాపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే, నన్ను ఏమైనా చేయండి. కానీ నా పార్టీ లీడర్లు, కార్యకర్తల జోలికి వెళ్లకండి. నేను ఇంట్లో గానీ, ఆఫీసులో గానీ ఉంటాను” అని పేర్కొన్నారు.

నిజం బయటకు వస్తుంది.. 

తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమ వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని విజయ్ చెప్పారు. అన్ని నిబంధనలు పాటించామని పేర్కొన్నారు. ‘‘ప్రజల భద్రత విషయంలో మేం రాజీపడలేదు. సురక్షితమైన ప్రాంతంలోనే సభ జరగాలని కోరుకున్నాను. ఆ మేరకే పోలీసులను పర్మిషన్ కోరాం. కానీ దురదృష్టవశాత్తు జరగకూడనిది జరిగింది. 

మేం ఇతర జిల్లాల్లోనూ ర్యాలీలు నిర్వహించాం. కానీ కరూర్‌‌‌‌లో మాత్రమే ఎందుకు ఇలా జరిగింది?” అని ప్రశ్నించారు. ‘‘వేదిక వద్ద మాట్లాడడం తప్ప.. మేం చేసిన తప్పేమీ లేదు. కానీ పోలీసులు మా లీడర్లు, స్నేహితులు, సోషల్ మీడియా పార్టనర్స్‌‌పై కేసులు నమోదు చేశారు” అని పేర్కొన్నారు. ‘‘నేను ఎలాంటి తప్పు చేయలేదు. నిజం త్వరలోనే బయటకు వస్తుంది. నా రాజకీయ జీవితం మరింత ఉత్సాహంతో ముందుకుసాగుతుంది” అని చెప్పారు. 

పోలీసులు చెప్తే విజయ్ వినలే: కనిమొళి 

పోలీసులు చెబితే విజయ్ వినలేదని, లేదంటే ఇంతటి ఘోరం జరిగేది కాదని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. ‘‘వేదికకు కొన్ని మీటర్ల ముందే విజయ్ క్యాంపెయిన్ బస్సును ఆపాలని పోలీసులు సూచించారు. కానీ విజయ్ వినలేదు. ఆయన పోలీసులు చెప్పినట్టు వినాల్సింది. మనందరం తప్పకుండా పోలీసులు 
చెప్పినట్టు వినాలి” అని సూచించారు. తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత విజయ్ అక్కడే ఉండి, సహాయక చర్యలు చేపట్టాల్సిందని పేర్కొన్నారు.