ఎమ్మెల్సీలు ఎవరో?.. కాంగ్రెస్ లో డజన్ మంది లైన్

ఎమ్మెల్సీలు ఎవరో?.. కాంగ్రెస్ లో డజన్ మంది లైన్

హైదరాబాద్: రాష్ట్రంలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సభ్యుల సంఖ్య రీత్యా కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఒక్కో స్థానం దక్కుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు పన్నెండు మంది లైన్లో  ఉన్నారు. సీనియర్ల కోటాలో కొందరు, బీసీ కోటాలో ఇంకొందరు, మైనార్టీ కోటాలో మరి కొందరు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారు కూడా తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ముషీరాబాద్, నిజామాబాద్ అర్బన్, అంబర్ పేట,నాంపల్లి సెగ్మెంట్ల నుంచి ఓడిపోయిన అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, రోహిన్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్ తమ వంతు ప్రయత్నాలను ప్రారంభించారు. 

అయితే బీసీ కోటాలో తనకు అవకాశం వస్తుందని అంజన్ కుమార్ యాదవ్ భావిస్తున్నారు. మైనార్టీ కోటాలో తనకు దక్కుతుందని షబ్బీర్ అలీ  అనుకుంటున్నారు.  సీఎంకు సన్నిహితుడిగా పేరున్న రోహిన్  రెడ్డి రేసులో ఉన్నారు. ఆయనకు దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. సీనియర్ల  కోటాలో జానారెడ్డి, మధుయాష్కీ, చిన్నారెడ్డి, సంపత్ కుమార్, జగ్గారెడ్డి అవకాశం కోసం వేచి చూస్తున్నారు. టీపీసీసీ వర్కింగ్  ప్రెసిడెంట్  మహేశ్ కుమార్ గౌడ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ నేత సంపత్ కుమార్ రేసులో ఉన్నట్టు సమాచారం. వీరితో పాటు పారిజాత నర్సింహారెడ్డి, ఇనుగాల వెంకట్రామిరెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో అధిష్టానం ఎవరి పేరు ఖరారు చేస్తుందో త్వరలోనే తేలనుంది. 

బీఆర్ఎస్ లో ఏడుగురు

 ఎన్నికలు జరగనున్న రెండు స్థానాల్లో ఒకటి బీఆర్ఎస్ కు దక్కుతుంది. ఈ సీటు కోసం ఏడుగురు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ లలో ఎవరికో ఒకరికి టికెట్ దక్కవచ్చని తెలుస్తోంది. వీరితోపాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (జనగామ), తాటికొండ రాజయ్య( స్టేషన్ ఘన్ పూర్) ప్రయత్నాల్లో ఉన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీగా చేస్తామని హామీ ఇచ్చారని, తమకే దక్కుతుందనే భావనతో వారున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నించి రిజెక్ట్ అయిన దాసోజు శ్రవణ్​, కుర్ర సత్యనారాయణ సైతం ఆశిస్తున్నారు. అధినేత ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది.