ఒకే కుటుంబంలో 26 మందికి క‌రోనా పాజిటివ్

ఒకే కుటుంబంలో 26 మందికి క‌రోనా పాజిటివ్

రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్ లో ఒకే కుటుంబంలో 26 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. జైపూర్ సిటీలోని సుభాష్ చౌక్ ఏరియాలోని ఆ కుటుంబంలో ఒక‌రికి వారం క్రితం క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఫ్యామిలీలో అంద‌రినీ క్వారంటైన్ చేశారు అధికారులు. హోం ఐసోలేష‌న్ లో ఉంచి ఆ కుటుంబంలోని 26 మంది శాంపిల్స్ సేక‌రించి టెస్టుల‌కు పంపామ‌ని జైపూర్ సీఎంహెచ్ఓ డాక్ట‌ర్ న‌రోత్త‌మ్ శ‌ర్మ చెప్పారు. నిన్న రాత్రి వారంద‌రి టెస్టు రిపోర్టు పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింద‌న్నారు. దీంతో ఆ 26 మందిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి.. చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు.

రాజ‌స్థాన్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 11 వేల‌కు పైగా క‌రోనా కేసులు నమోద‌య్యాయి. అందులో 251 మంది మ‌ర‌ణించ‌గా.. 8,182 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే రాష్ట్రంలో క‌రోనా కేసులు అత్య‌ధికంగా జైపూర్, జోధ్ పూర్ సిటీల్లోనే న‌మోద‌వుతున్నాయి. జైపూర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 2,321 మందికి క‌రోనా సోక‌గా.. వారిలో 117 మంది మ‌ర‌ణించారు. జోధ్ పూర్ లో 1,887 మంది వైర‌స్ బారిన‌ప‌డగా.. 24 మంది ప్రాణాలు కోల్పోయారు.