ట్విట్టర్‌కు లాస్ట్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం

ట్విట్టర్‌కు లాస్ట్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం

కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త ఐటీ రూల్స్ ప్రకారం.. గ్రీవియన్స్ సెల్ ఏర్పాటు చేయకపోవడంపై ట్విట్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా భారత్‌కు చెందిన అధికారులతో గ్రీవియన్స్ సెల్‌‌ను సిద్ధం చేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని కేంద్రం ప్రభుత్వం ట్విట్టర్‌ను హెచ్చరించింది.  

‘కొత్త ఐటీ రూల్స్ అమలు పరచడానికి  ట్విట్టర్ సంస్థకు  చివరిసారిగా నోటీస్ ఇచ్చాం. దానిని అనుసరించి నడుచుకోకపోతే ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 79 ప్రకారం సంస్థ తన బాధ్యతలను కోల్పోవాల్సి వస్తుంది. ఈ పూర్తి పరిణామానికి ట్విట్టరే బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని ప్రభుత్వం తన నోటీసులో పేర్కొంది.

డిజిటల్ మీడియాలో కంటెంట్ నియంత్రణ కోసం కేంద్రం నూతన ఐటీ రూల్స్‌ను ప్రవేశపెట్టింది. ఆ రూల్స్‌ను అమలు పరచడం కోసం డిజిటల్ మీడియా సంస్థలకు మూడు నెలల గడువు కూడా ఇచ్చింది. అయితే ఆ గడువు ముగియడంతో మే 26 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. కొత్త రూల్స్ ప్రకారం సోషల్ మీడియా సంస్థలు చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ ఆఫీసర్లుగా భారత్‌కు చెందిన వ్యక్తులను నియమించాలి. కానీ ఈ విషయంలో ట్విట్టర్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చి వారం గడిచినా ట్విట్ట్రర్ స్పందించకపోవడంపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

కాగా.. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ అకౌంట్‌కు సంబంధించి వెరిఫైడ్ బ్లూ టిక్ మార్కును శనివారం ఉదయం ట్విట్టర్ తొలగించింది. ఆ తర్వాత కాసేపటికే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఖాతాకు కూడా బ్లూ టిక్ మార్కును తొలగించింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అప్రమత్తమైన ట్విట్టర్.. వారి అకౌంట్లకు బ్లూ టిక్ మార్కును లింక్ చేసింది.