వీడిన సైంటిస్ట్​ హత్య మిస్టరీ..నిందితుడు అరెస్ట్

వీడిన సైంటిస్ట్​ హత్య మిస్టరీ..నిందితుడు అరెస్ట్

హైదరాబాద్​, వెలుగు: నేషనల్​ రిమోట్​ సెన్సింగ్​ సెంటర్​ (ఎన్​ఆర్​ఎస్​సీ) సైంటిస్ట్​ శ్రీధరన్​ సురేశ్​ హత్య మిస్టరీ వీడింది. నిందితుడు జనగామ శ్రీనివాస్​ (39)ను ఎస్​ఆర్​ నగర్​ పోలీసులు శుక్రవారం అరెస్ట్​ చేశారు. నిందితుడి నుంచి కత్తి, రెండు ఉంగరాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను వెస్ట్​ జోన్​ డీసీపీ సుమతితో కలిసి సీపీ అంజనీ కుమార్​ వెల్లడించారు. సురేశ్​, శ్రీనివాస్​ మధ్య స్వలింగ సంపర్క సంబంధం ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ప్రముఖ డయాగ్నస్టిక్స్​ సెంటర్​లో పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన శ్రీనివాస్​ ల్యాబ్​ టెక్నీషియన్​గా పనిచేస్తున్నాడు. అనారోగ్యం కారణంగా రక్త పరీక్ష కోసం అక్కడికి వెళ్లిన సురేశ్​కు శ్రీనివాస్​తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా  చనువుగా మారి స్వలింగ సంపర్కం వరకు వెళ్లింది. దీంతో కొంతకాలంగా శ్రీనివాస్​, సురేశ్​ ఉండే అమీర్​పేట్​ ధరమ్​కరణ్​రోడ్డులోని అన్నపూర్ణ అపార్ట్​మెంట్​లోని ఫ్లాట్​నంబర్​ ఎస్​2కు వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో సురేశ్​ దగ్గరి నుంచి శ్రీనివాస్​ అవసరాల కోసం డబ్బులు తీసుకునేవాడు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం డబ్బుల దగ్గర ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. డిమాండ్​ చేసిన డబ్బులు ఇవ్వకపోవడంతో సురేశ్​ను చంపేందుకు శ్రీనివాస్​ కుట్ర పన్నాడు. సోమవారం సాయంత్రం 5.30 గంటలకి సురేశ్​ తన ఇంటికి వెళ్లాడు. రాత్రి 7.30 గంటలకు శ్రీనివాస్​ ఆయన ఫ్లాట్​కు వచ్చాడు. రాత్రి 9.30 గంటలకు ఇద్దరి మధ్యా మరోసారి డబ్బు గురించి గొడవ జరిగింది. సురేశ్​ తలపై శ్రీనివాస్​ కత్తితో పొడిచి చంపేశాడు. సురేశ్​ భార్య ఇందిర ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఆయన ఫోన్​ను తీసుకుని కాల్​డేటా తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ, వేలి ముద్రలు, ఘటనా స్థలంలో పడి ఉన్న వెంట్రుకలను సేకరించారు. అపార్ట్​మెంట్​ వాచ్​మన్​, స్థానికులు ఇచ్చిన సమాచారంతో శ్రీనివాస్​ కోసం గాలించారు. మూడు స్పెషల్​ టీంలతో కరీంనగర్​, రామగుండంలో వెతికారు. శుక్రవారం అతడిని అరెస్ట్​ చేశారు.