కస్టమ్స్ అధికారులమంటూ 4 లక్షలు దోపిడీ

కస్టమ్స్ అధికారులమంటూ 4 లక్షలు దోపిడీ
  • దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తిని మోసగించిన దుండగులు
  • ఢిల్లీ ఎయిర్​పోర్టు వద్ద ఘటన

న్యూఢిల్లీ: కస్టమ్స్ అధికారులమని చెప్పి ఇద్దరు దుండగులు దుబాయ్ నుంచి వచ్చిన  వ్యక్తి దగ్గర ఉన్న డబ్బంతా దోచేశారు. తాను మోసపోయానంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటపడింది. రాజస్థాన్​లోని అజ్మీర్​కు చెందిన మహ్మద్ సులేమాన్ సౌదీ అరేబియా నుంచి ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీ ఎయిర్​పోర్టులో దిగాడు. బయటికి రాగానే ఇద్దరు వ్యక్తులు దగ్గరికి వచ్చి తాము కస్టమ్స్ అధికారులమని చెప్పి అతడిని బెదిరించారు. అతని పాస్​పోర్టు తీసుకుని, కారులో మహిపాల్​పూర్​వరకు తీసుకెళ్లారు.

ఎవరూ లేని చోట ఆపి సులేమాన్​ దగ్గర ఉన్న 19 వేల సౌదీ రియాల్​లు(రూ4.15లక్షలు) ఎక్కడివని ప్రశ్నించారు. ఆపై అతడి దగ్గరున్న రూ.2 వేల నగదు, మొబైల్​ఫోన్ లాక్కున్నారు. మరో ఆఫీసర్ వస్తారని చెప్పి అతడిని అక్కడే దింపేసి ఉడాయించారు. కాసేపయినా ఎవరూ రాకపోవడంతో మోసపోయానని సులేమాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.