మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు క్వారీ నీటికుంటలో పడి మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. మాసాయిపేట మండలం హాక్కిం పెట్ గ్రామ శివారులోని ఓ క్వారీ నీటి కుంటలో ఈత కొట్టేందుకు మాసాయిపేట గ్రామానికి చెందిన జల నందకిషోర్(15), భాను(15) వెళ్లారు. నీటి లోతును అంచనా వేయలేక వారు కుంటలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
నీటిలో మునిగి ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పోవడంతో మాసాయిపేట గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. చేతికి అందిన కొడుకులు విగతజీవులుగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు. ఈ వేసవి కాలంలో నీటి కుంటలు, క్వారీ కుంటల వద్దకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
