
ఉత్తరప్రదేశ్‌లోని బడాన్ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నీటి గుంట వద్దకు స్నానానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందారు. ఉఘాటి ప్రాంతంలో ఇటుక బట్టీ సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌కుమార్ (8), సోను (6) అనే ఇద్దరు పిల్లలు స్నానం చేయడానికని ఇటుక బట్టీ సమీపంలో ఉన్న ఓ నీటి గుంట వద్దకు వెళ్లారు. సరదాగా ఆటలాడుదామని దిగి, లోతు ఎక్కువగా ఉండడంతో ప్రమాద వశాత్తు అందులో పడి మరణించారు. చిన్నారుల ఆచూకీ తెలియక ఇటుక బట్టీలో పని చేసే వారి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని… చుట్టూ పక్కల గాలించి, నీటి గుంటలో పడిన ఇద్దరు పిల్లల మృతదేహాలను బయటకు తీశారు . ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.