
ఇంఫాల్ : మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. తెంగ్నౌపాల్ జిల్లాలోని భారత్–-మయన్మార్ బార్డర్లో గల మోరే టౌన్లో బుధవారం అనుమానిత కుకీ టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. భద్రతా బలగాల పోస్ట్‌పై బాంబులు విసిరి, కాల్పులు జరపడంతో తొలుత వాంగ్‌ఖేమ్ సోమోర్జిత్ అనే కమాండో మృతిచెందాడు. బుధవారం రాత్రి తఖెల్లంబం శైలేశ్వర్ మరో కమాండో మరణించాడు. మరో ఇద్దరు కమాండోలు తీవ్రంగా గాయపడగా.. ట్రీట్మెంట్ కోసం వారిని ఇంఫాల్‌కు తరలించారు.
టెర్రరిస్టులు, కమాండోల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. వాంగ్‌ఖేమ్ సోమోర్జిత్ మోరేలో రాష్ట్ర పోలీసు కమాండోకు అనుబంధంగా ఉన్న ఐఆర్బీలో పనిచేస్తున్నట్టు గుర్తించారు. సోమోర్జిత్.. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని మాలోమ్ నివాసి. బుధవారం ఉదయం మోరే టౌన్‌లోని మూడు వేర్వేరు ప్రదేశాలలో అనుమానిత కుకీ టెర్రరిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. మోరే సమీపంలోని పలు వెహికల్స్‌ను ధ్వంసం చేశారని చెప్పారు.
ఒక పోలీసు అధికారిని హత్య చేసిన ఇద్దరు అనుమానితులను రాష్ట్ర బలగాలు అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితులను అరెస్ట్ చేయడంతోనే కుకీ టెర్రరిస్టులు భద్రతా దళాల పోస్ట్‌పై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. కాగా, కుకీ ఇన్పి తెంగ్నౌపాల్ (కిట్)తో సహా పలు పౌర సంస్థలు వారి అరెస్టును తీవ్రంగా ఖండించాయి. 24 గంటల్లో వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని కిట్ హెచ్చరించింది.