చెరువులో దూకిన యువకుడిని కాపాడబోయి మరో ఇద్దరు మృతి

V6 Velugu Posted on Sep 02, 2021

మైలవరం: ఏపీలోని కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం ముత్యాలంపాడులో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకుంటానంటూ చెరువులో దూకిన యువకుడిని కాపాడబోయి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ఆ యువకుడు సేఫ్..

మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకుంటానంటూ ముత్యాలంపాడుకు చెందిన పచ్చిగోళ్ల ప్రవీణ్ అనే యువకుడు చెరువులో దూకాడు. దీంతో అతడిని కాపాడేందుకు చిలపరపు నాని, పచ్చిగోళ్ల చిన్న కోటేశ్వరరావు అనే ఇద్దరు వెనుకనే చెరువులోకి దూకారు. అయితే పెద్దగా ఈతరాని చిలపరపు నాని (19), కోటేశ్వరరావు (34) గల్లంతయ్యారు. ఎంతసేపటికీ వాళ్లు బయటకు రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈతగాళ్లను తీసుకొచ్చి పోలీసులు గాలింపు చేపట్టగా కోటేశ్వరరావు మృతదేహం దొరికింది. నాని డెడ్‌బాడీ కోసం ఇంకా గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఒకరిని రక్షించడానికి ప్రయత్నించి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఊరంతా విషాదచాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనకు కారణమైన యువకుడు ప్రవీణ్ మాత్రం సేఫ్‌గా ఉన్నాడు. మద్యం మత్తులో చెరువులో దూకినప్పటికీ అతడికి ఈత రావడంతో సురక్షితంగా బయటకు వచ్చేశాడు.

 

 

Tagged AP, crime, Youth Suicide, pond, Krishna district

Latest Videos

Subscribe Now

More News