కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం హనుమాన్ తండాలో విషజ్వరంతో ఏడాదిన్నర వయసు ఉన్న భుక్యా రూప చనిపోయింది. వివరాలిలా ఉన్నాయి.. తండాకు చెందిన రాజేందర్, సంధ్య దంపతులు హైదరాబాద్లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. కూతురు రూపకు 5 రోజుల కింద హైదరాబాద్ లో ఉండగానే జ్వరం వచ్చి తగ్గింది. స్వగ్రామంలో పని ఉందని శనివారం కూతురుతో కలిసి వస్తుండగా.. దారిలో మళ్లీ జ్వరం రావడంతో నర్సంపేటలో చికిత్స చేయించి హనుమాన్ తండా కు చేరుకొన్నారు. ఆదివారం ఉదయం జ్వరం ఎక్కువై ఫిట్స్ రావడంతో చికిత్స కోసం నర్సంపేటకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు తల్లిదండ్రులు తెలిపారు.
నందిమేడారంలో యువకుడు..
ధర్మారం: కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన నేరెళ్ల ప్రశాంత్(26) జ్వరంతో చనిపోయాడు. పది రోజులుగా జ్వరంతో బాధ పడుతున్న ప్రశాంత్ స్థానికంగా ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గక పోవడంతో.. శనివారం ఉదయం ధర్మారంలోని ఓ ప్రైవేట్ హాస్పిటలలో పరీక్షలు చేయించుకున్నాడు. అస్వస్థతకు గురి కావడంతో అక్కడి నుంచి అంబులెన్స్ లో కరీంనగర్ కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయాడు. ప్రశాంత్ కు భార్య అక్షయ ఉంది.