ఇద్దరు ఉద్యోగులకు స్వైన్ ఫ్లూ: భారత్ లో SAP ఆఫీసులు క్లోజ్

ఇద్దరు ఉద్యోగులకు స్వైన్ ఫ్లూ: భారత్ లో SAP ఆఫీసులు క్లోజ్

స్వైన్ ఫ్లూ భయంతో ముందు జాగ్రత్తగా భారత్ లోని పలు సిటీల్లో తమ ఆఫీసులను జర్మనీ సాఫ్ట్ వేర్ కంపెనీ SAP మూసేంది. బెంగళూరులోని ఎకో వరల్డ్ ఏరియాలో ఉన్న SAP ఆఫీస్ లో ఇద్దరు ఉద్యోగులకు స్వైన్ ఫ్లూ వచ్చినట్లు తేలడంతో ఆ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. బెంగళూరు, గురుగ్రామ్, ముంబైల్లోని తమ ఆఫీసులన్నీ క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మళ్లీ చెప్పే వరకు ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది.

ఉద్యోగుల ఆరోగ్యం ముఖ్యం

కంపెనీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం తమకు అత్యంత ముఖ్యమని SAP ఇండియా వెల్లడించింది. ఇద్దరు ఉద్యోగులకు స్వైన్ ఫ్లూ రావడంతో ఇది గాలిలో ఒకరి నుంచి మరొకరికి పాకే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఉద్యోగుల ఆరోగ్యం దృష్ట్యా బెంగళూరు, గురుగ్రామ్, ముంబై సిటీల్లో ఉన్న అన్ని ఆఫీసులను క్లోజ్ చేశామని చెప్పింది. తదుపరి సమాచారం ఇచ్చే వరకు ఆయా లొకేషన్లలోని ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయాల్సిందిగా కోరినట్లు వెల్లడించింది.

స్వైన్ ఫ్లూ లక్షణాలు

జలుబు, దగ్గు, జ్వరం, గొంతులో మంట, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, తల నొప్పి, చలి లాంటివి స్వైన్ ఫ్లూ లక్షణాలు. రెండు మూడ్రోజుల కన్నా ఎక్కువగా ఈ సింప్టమ్స్ కొనసాగితే ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోవడం మంచిది. స్వైన్ ఫ్లూ తుమ్ములు, దగ్గు ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది.