హిమాయత్ సాగర్‎కు పొటెత్తిన్న వరద.. రిజర్వాయర్ మూడు గేట్లు ఓపెన్

హిమాయత్ సాగర్‎కు పొటెత్తిన్న వరద.. రిజర్వాయర్ మూడు గేట్లు ఓపెన్

హైదరాబాద్ నగరంలో గురువారం (ఆగస్ట్ 7) రాత్రి కురిసిన భారీ వర్షానికి హిమాయత్ సాగర్ జలశయానికి వరద పొటెత్తింది. రిజర్వాయర్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరడంతో గురువారం రాత్రి ఒక గేట్ ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. వరద ఉధృతి కొనసాగుతుండటంతో శుక్రవారం (ఆగస్ట్ 8) ఉదయం మరో రెండ్లు గేట్లను ఎత్తారు. మొత్తం మూడు గేట్లు ఓపెన్ చేసి 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ 1763.50 ఫీట్లు కాగా.. ప్రస్తుతం 1763.10 ఫీట్లు మెయింటెన్ చేస్తున్నారు అధికారులు. 

హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ పరివాహక ప్రాంతాలకు అలెర్ట్ జారీ చేశారు అధికారులు. రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. హిమాయత్ సాగర్ మరో రెండు గేట్లు ఎత్తితే.. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు అధికారులు. 

కాగా, గురువారం (ఆగస్ట్ 7) రాత్రి హైదరాబాద్ సిటీలో కుండపోత వర్షం కురిసిన విషయం తెలిసిందే. దాదాపు గంటన్నర సేపు నాన్ స్టాప్‎గా వర్షం పడింది. దాదాపు నగరంలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్ష బీభత్సానికి నగరం అల్లకల్లోలమైంది. వరద నీటితో నగరంలోని రోడ్లన్నీ నదులను తలపించాయి. సిటీలోని రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 

లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో కురిసిన కుండపోత వర్షంతో హైదరాబాద్ జంట జలశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద నీరు పొటెత్తింది. రెండు జలశయాలు నిండుకుండలా మారాయి. రిజర్వాయర్ల నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ గేట్లు లిఫ్ట్ చేయడంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 

హిమాయత్ సాగర్ రిజర్వాయర్ వివరాలు:

  • పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు
  • ప్రస్తుత నీటి స్థాయి : 1762.60 అడుగులు
  • రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.970 టీఎంసీలు
  • ప్రస్తుత సామర్థ్యం : 2.715 టీఎంసీలు
  • ఇన్ ఫ్లో : 1000 క్యూసెక్కులు
  • అవుట్ ఫ్లో : 600 క్యూసెక్కులు
  • మొత్తం గేట్ల సంఖ్య : 17
  • ఎత్తిన గేట్ల సంఖ్య : 3