
హైదరాబాద్ లోని మాదాపూర్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో పబ్ లలో తనిఖీలు చేపట్టారు ఎస్ఓటీ పోలీసులు. శుక్రవారం ( మే 25 ) చేపట్టిన ఈ తనిఖీల్లో డ్రగ్స్ తీసుకున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మాదాపూర్, గచ్చిబౌలిలోని అకాన్, A 19 పబ్ లలో తనిఖీలు చేపట్టారు పోలీసులు. పబ్ ల దగ్గర డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా రెండు పబ్ లలో ఇద్దరికి పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు తెలిపారు పోలీసులు.
నిందితులను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు ఎస్ఓటీ పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్, గచ్చిబౌలి పోలీసులు. ఇటీవల హైదరాబాద్ లో డ్రగ్స్ దందా యథేచ్ఛగా జరుగుతోంది.. ముఖ్యంగా ఐటీ హబ్ లు అయిన హైటెక్ సిటీ, గచ్చిబౌలి, సహా జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాల్లో ఉన్న పబ్ లలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి.
ఇటీవల జూబ్లీ హిల్స్ లోని ఆలివ్ బిస్ట్రో పబ్ లో కూడా డ్రగ్స్ సేవిస్తూ పలువురు పట్టుబడ్డారు. ఈ పబ్ లో మాదాపూర్ పోలీసులు పలువురికి డ్రగ్స్ టెస్టులు చేయగా, ఒకరికి పాజిటివ్ వచ్చింది. ఆలివ్ బిస్ట్రో పబ్‌లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం అందడంతో మాదాపూర్ పోలీసులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. పబ్‌లోని 20 మందికి టెస్టులు నిర్వహించారు. ఇందులో జూబ్లీహిల్స్ కు చెందిన సిద్ధార్థ్(23) అనే యువకుడికి గంజాయి పాజిటివ్ వచ్చింది.
సిద్ధార్థ్ జనవరి 31వ తేదీన థాయిలాండ్ వెళ్లినట్లు, అక్కడ బిస్కెట్లు తిన్నానని, అందులో డ్రగ్స్ ఉన్నట్లు తనకు తెలియదని పోలీసుల ఎదుట అంగీకరించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ సెంటర్‌కు తరలించారు.