సెల్ ఫోన్ నుంచి బిగ్​బాస్​ దాకా..

సెల్ ఫోన్ నుంచి బిగ్​బాస్​ దాకా..

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండు సంఘటనలు చాలామందిని ఆలోచింపచేశాయి. రాజకీయాలు కేవలం ‘ఓట్ల వేట’లో ఉన్నప్పుడు ఇలాంటివాటిపై తక్కువ చర్చ జరుగుతుంది. సామూహికంగా మొద్దుబారిన సమాజంపై ప్రభావం పడే ‘సంఘటన’ల కన్నా వ్యక్తులుగా అనేకమందిని ఇవి ఆలోచింపచేస్తున్నాయి. లంబాడా తండాలో జన్మించి ఎంతో కష్టపడి మెడికల్‌‌‌‌ సీటు సాధించిన ‘ప్రీతి’ అనే మెడికోను ఆమె సీనియర్‌‌‌‌ ‘సైఫ్‌‌‌‌’ వేధింపులకు గురిచేస్తే ఆత్మహత్య చేసుకుందని కొందరు, కాదు కాదు అది హత్య అని ఇంకొందరు వ్యాఖ్యానం చేశారు. వాళ్ళ కుటుంబానికి ‘న్యాయం’ అంటే కొన్ని లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం. ఇవన్నీ ఉపశమనాలు మాత్రమే. కానీ కన్నవారిని కోల్పోయిన శోకం ఎన్నటికీ చల్లారని మంట అన్న విషయం ప్రభుత్వాలు, సమాజం మరిచిపోయాయి. 

ప్రీతి సంఘటన

ఆఖరుకు కులాలను, బలాలను బట్టి ఆ ఘటనపై చర్చ చేయడం కూడా ఓ సంప్రదాయంగా మారుతున్నది. ఆయా కులాల గురించి మాట్లాడే మేధావులు, సంఘాలు నాలుగు రోజులు మాట్లాడితే పరామర్శలు, పరిహారాలు ఉంటాయి. ఏ ఘటన జరిగినా ఒక ఆడపిల్లకు ‘అన్యాయం’ జరిగిందనే విషయాన్ని మనం విస్మరిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ఆ ‘సున్నితత్వం’ మనం కోల్పోయాం. లంబాడా తండా నుండి ధైర్యంగా బయటికి వచ్చి భవిష్యత్‌‌‌‌లో ఎన్నో  ప్రాణాలను కాపాడే ఒక డాక్టర్‌‌‌‌ను ఈ సమాజం కోల్పోయింది. మళ్ళీ ఆ తండా నుండి ఆడపిల్లలు ధైర్యంగా బయటికి రాగలరా!  న్యాయం చేయడం కన్నా ‘పరిహారం’ ప్రకటిస్తే పంచాయతీ తెగిపోతున్నది. దాంతో కథ కంచికి.. మనం ఇంటికి. 

గుండెను తీస్తున్న క్రూరత్వం

ప్రేమికురాలి కోసం ప్రస్తుత ప్రియుడు పాత ప్రియుడిని చంపి గుండెకాయను బయటకు తీయడం కేవలం హత్య మాత్రమే కాదు, క్రూరత్వాన్ని ప్రకటిస్తున్నది. ఇంతటి క్రూరత్వం అతనిలో ఎందుకు కలిగింది? ఎవరు కలిగించారు? అంటే వందమందిని వేలెత్తి చూపవచ్చు. ఈ సంఘటనలో ఉన్నవాళ్ళంతా 20 ఏళ్ళ వయసుకు అటు-ఇటు వారే! ఇలాంటి ఘటనలు రోజూ పత్రికల్లో, టీవీల్లో, సోషల్‌‌‌‌ మీడియాలో చూస్తున్నాం. ‘ప్రియురాలి కోసం హత్య’ అనే వార్త మన సమాజానికి ఎక్కువ ప్రాధాన్య అంశం కావచ్చు. కానీ ఇలాంటి వార్తలు రోజూ వింటున్నాం. నడిరోడ్డుపై నరకడాలు, ఆస్తి కోసం హత్యలు, కుటుంబ సభ్యులను ఒకరినొకరు చంపుకోవడం, భార్యాభర్తల పరస్పర హత్యలు, ముక్కుపచ్చలారని వాళ్ళపై వృద్ధులు అత్యాచారం చేయడం, యువకులు-పెద్దలు క్రూరంగా అత్యాచారాలు చేయడం అనేవి ఇప్పుడు రోజూ చూస్తున్న విశేషాలు. వీటన్నిటి గురించి ఒక్క మేధావీ మాట్లాడడు. సామాజిక కార్యకర్తలుగా బ్రాండ్‌‌‌‌ వేసుకొని తిరిగే ‘సంఘ నాయకులూ’ మాట్లాడరు.  కొందరు సిద్ధాంతాల మకిలిని మనసు నిండా పరచుకొని ‘మార్క్స్‌‌‌‌, మావో’ ల నుంచి  క్రిందికు దిగరు. ఇప్పుడు మాట్లాడేవాళ్ళంతా ‘కుల సంఘాల’ గుంపులే. వారిలో కూడా కొంతమందికి ‘ప్రచార యావ’ తప్ప ఇంకేం ఉండదు. మరి మిగతా సమాజానికి ఏం అయ్యింది? అన్న ప్రశ్న వేయాలంటే అందరూ జంకుతున్నారు.

సెల్ ఫోన్ నుంచి బిగ్​బాస్​ దాకా..

కుటుంబ వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా మారిన ‘పరాయీకరణ’ ఇంకో కారణం. ఇంత పెద్ద జనాభా, వైవిధ్యం గల దేశంలో ఏ ఇంటివారు ఆ ఇంటి సంతతిని నియంత్రించాలి. ‘విలువలు’ వదిలేసి పూర్తిగా ప్రభుత్వ మెకానిజంపై ఆధారపడడం ప్రధాన లోపం. వ్యక్తి లోపలి అవలక్షణాలను నిరూపించలేని, పసిగట్టలేని వ్యవస్థలు తీర్పరులుగా ఉండడం మరో లోపం. వీటన్నిటికి తోడు అపరిపక్వ మనసున్న వ్యక్తుల చేతుల్లోకి అపరిమితమైన ‘ప్రపంచం’ అయిన సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ రావడం, దాని వాడకంలో విచక్షణ లోపించడం ప్రధాన కారణాలు. ఇదంతా ఒక ఎత్తయితే ‘ప్రభుత్వ వ్యవస్థ’లకు చిత్తశుద్ధి లోపించడం ప్రధాన కారణం అని అందరూ దుమ్మెత్తి పోస్తారు. కార్పొరేట్‌‌‌‌ విద్యావ్యవస్థలను రాజకీయ నాయకులే లోపాయికారీగా పెంచి పోషించినప్పుడు వాటి నియంత్రణ వ్యవస్థ చేతులు దాటినప్పుడు ఎంత దుర్మార్గం జరుగుతుందో కదా! తల్లిదండ్రుల ‘అత్యాశ’ కూడా మరో పెద్ద దుర్మార్గం. సినిమావాళ్ళు సృష్టిస్తోన్న విధ్వంసం యువత మనసుపై ఎక్కువ ప్రభావం చూపుతున్నది. అలాగే యూట్యూబ్‌‌‌‌ వ్యాపారంగా మారిపోయాక డబ్బుకోసం, పేరు ప్రతిష్ఠల కోసం చేస్తున్న విచ్చిలవిడితనం మన సామాజిక పునాదులను కబళిస్తోంది. అలాగే ‘విదేశీ విష సంస్కృతి మనకు కొత్త రకం వంటకంగా వండివార్చుతుంటే (బిగ్‌‌‌‌బాస్‌‌‌‌ లా) ఖాళీగా ఉన్న మన పిల్లల మెదళ్ళు మలినం అవుతున్నదీ నిజం. రోజూ టీవీల్లో సినిమాల్లో వందకుపైగా రేప్‌‌‌‌లు, 150కి పైగా హత్యలూ చూస్తూ ఉన్న యువత మనస్సు సున్నితత్వం కోల్పోయి వాటి పట్ల ఆకర్షింపబడటం సహజమే కదా! డబ్బులు, హోదాలు, కులాల వారసత్వం, సుఖభోగాలు మనం పిల్లలకు ఇవ్వడంతో పాటు ‘నైతిక జీవనం’ ఇవ్వకపోతే మన సమాజానికి మనమే పాడె కట్టినట్లే. ఎంతో శ్రమించి సాధించుకున్న ఈ స్వాతంత్య్రం నిజంగా మేడిపండే. దాని లోపల మొత్తం రాచపుండే.

సాంస్కృతిక విధ్వంసం

విద్య విలువలు కోల్పోయి కార్పొరేటీకరణ చెందడం మొదటి కారణం అయితే, దాని వెనుక ఉన్న డబ్బు, హోదా ఈ సమస్యకు మూలకారణం. మెదడులో ఏమీ లేకుండా సామాజిక భావోద్వేగాలు కోల్పోయిన విద్యార్థుల మెదళ్లలో ‘సినిమా’ల్లోని అశ్లీలత, జుగుప్స, హింస నింపడం రెండవ కారణం. బానిసలుగా చేసి పాలించిన సిద్ధాంతాలకు కొనసాగింపుగా జరిగిన సాంస్కృతిక విధ్వంసం మరో కారణం. ప్రభుత్వ ఆదాయం కోసం ఏరులై పారుతున్న మద్యం, ధన సంపాదన కొరకు జరుగుతున్న డ్రగ్స్‌‌‌‌, ఇతర మత్తుపదార్థాల ప్రభావం యువతను నిర్వీర్యం చేయడమే కాకుండా వారిని ఇలాంటి క్రిమినల్స్‌‌‌‌ గా మారుస్తోంది. యువతను దుర్మార్గులుగా చేసి డబ్బు సంపాదించే పబ్బులు, క్లబ్బులు చదువుకున్న వాళ్ళను సైతం హింస వైపు పురిగొలుపుతోంది అన్నది జగమెరిగిన కారణం. అమ్మ ఒడి, బడి, గుడి.. ఈ మూడూ ఈరోజు ధ్వంసం అయిపోయాయి. దానివల్ల మనకు తెలియకుండానే ఇంటిలోనే ‘పరాయీకరణ’ చెందాం. చదువు చాలా ఉంది కానీ కామన్‌‌‌‌ సెన్స్‌‌‌‌ లేదు. సామాజిక మాధ్యమాల్లో ఫ్రెండ్స్​ఉంటారు కానీ, నియంత్రించే బెస్ట్‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌ దొరకరు. ఆదాయం పెరిగింది కానీ మనశ్శాంతి తగ్గింది. బోలెడన్ని తెలివితేటలు కానీ భావోద్వేగాలకే కరవు. చంద్రమండలం పైకి ప్రయాణం చేస్తారు కానీ పక్కింటిలో ఏం జరుగుతుందో తెలుసుకోలేరు.

మూలం వదిలి, ఇజం భాష్యాలు

సైఫ్‌‌‌‌ది తప్పు అంటే ‘మైనార్టీలు మనకు వ్యతిరేకం అవుతారేమో?’ అని భ్రమపడతారు మరికొందరు. మరి ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నటి ప్రత్యూష హత్యా సంఘటన, అయేషా మీరా కేసు ఇప్పటికీ మన అంతరాత్మను ప్రశ్నిస్తున్నాయి. ఆయేషా మీరా మైనారిటీ అయినా ఆంధ్రకు చెందిన నికార్సయిన తెలుగు మాట్లాడే, శ్లోకాలు, స్తోత్రాలు చదివే అమ్మాయి కాబట్టి మైనారిటీలకు వంతపాడే పెద్ద పార్టీకి పెద్దగా పట్టలేదు. ఇప్పుడు సైఫ్‌‌‌‌, ఇటీవల జూబ్లీహిల్స్‌‌‌‌ రేప్‌‌‌‌ ఘటనలో నిందితులుగా పేర్కొన్న వాళ్ళకు రాజకీయ అండదండలు ఉన్నాయని బండి సంజయ్‌‌‌‌ లాంటి వారు వాదిస్తే అదంతా మతతత్వమే!? ఎందుకంటే మనం బాధితుల్లో ‘న్యాయం’ కన్నా కులం, మతం వెతకడం ప్రారంభించి చాలా రోజులయింది.ఈ సమస్యకు కారణం కమ్యూనిస్టులను అడిగితే నరేంద్రమోదీ అని ఠక్కున చెప్పేస్తారు. ఓ సోకాల్డ్​అభ్యుదయవాద మహిళ.. ‘స్వేచ్ఛ’ లేకపోవడం వల్లనే ఇది జరిగింది అంటూ న్యూయార్క్‌‌‌‌ టైమ్స్ లో వ్యాసం రాస్తుంది. ఓ స్వయం ప్రకటిత చరిత్రకారుడిని అడిగితే గాంధీని గాడ్సే చంపడం వల్లే ఇలా జరుగుతోందని చెప్పేస్తాడు. ఓ వామ మేధావిని అడిగితే ‘అర్బన్‌‌‌‌ నక్సల్స్‌‌‌‌’ పేరుతో జరిగిన అణచివేతే కారణం అంటాడు. వారి వర్షన్‌‌‌‌ వారిది. కానీ దీనికి మూలాలు ఏమిటి ? వాళ్ళకన్నా ఎక్కువ సమాజం ఆలోచించడం మరచిపోయింది. ఎవరికి వారు ఎదుర్కోవడం సాహసం అనుకొంటున్నారు కానీ ఈ ‘సామాజిక రుగ్మత’కు మూలం ఎక్కడుంది? అనే ఆలోచన విస్మరించాం.

- డా.పి.భాస్కరయోగి, సోషల్ ​అండ్​ పొలిటికల్​ ఎనలిస్ట్​