కర్రకు టంగ్ ​క్లీనర్ ​కట్టి..కిటికీ బోల్ట్ తీసి దొంగతనాలు

కర్రకు టంగ్ ​క్లీనర్ ​కట్టి..కిటికీ బోల్ట్ తీసి దొంగతనాలు
  • సొత్తంతా ముత్తూట్ ​ఫైనాన్స్​లో తాకట్టు
  • ఆ పైసలతో బెట్టింగ్​లు, జల్సాలు
  • అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ 
  • 83 తులాల గోల్డ్, కారు, బుల్లెట్​స్వాధీనం 
  • వివరాలు వెల్లడించిన ఎస్పీ అపూర్వ రావు

మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ, నల్గొండ జిల్లా కేంద్రం పరిధిలోని బైపాస్ ల వెంట ఎవరూ లేని ఇండ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్​స్టేషన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అపూర్వరావు వివరాలు వెల్లడించారు. ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట ఎన్ జీవో కాలనీకి చెందిన జంగా వెంకట రావు ..ఇదే జిల్లా రాజుపాలెం మండల ఉప్పలపాడు వాసి దమ్ము సుధాకర్ కూలీలు.  జల్సాలకు అలవాటు పడిన వీరు ఇండ్లల్లో చోరీలు చేయడం మొదలుపెట్టారు.

2011లో ఓ దొంగతనం చేసి జైలుకు వెళ్లి వచ్చారు. తర్వాత కూడా మిర్యాలగూడలో 16, నల్గొండ జిల్లా కేంద్రంలో 4 దొంగతనాలు చేశారు. ఇనుపరాడ్డుతో ఇంటి కిటికీ పగలగొట్టి మూడు అడుగుల కర్రకు టంగ్ క్లీనర్ కట్టి కిటికీ బోల్ట్ తొలగించి అందులోంచి లోపలకు వెళ్లడం వీరి ప్రత్యేకత. తర్వాత ఇంట్లో ఉన్నదంతా సర్ధుకుని చెక్కేస్తారు. దొంగిలించిన సొత్తును నర్సాపురం ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడంతో పాటు క్రికెట్ బెట్టింగ్ పెట్టేవారు.  

ఈ మధ్య దొంగిలించిన బంగారాన్ని అమ్మేందుకు కొట్టేసిన కారులో హైదరాబాద్ వెళ్తుండగా నందిపాడు చౌరస్తా వద్ద పట్టుకున్నారు. రూ. 60 లక్షల విలువైన 83 తులాల బంగారం, 8 తులాల వెండి, కారు, బుల్లెట్​ స్వాధీనం చేసుకున్నారు. కేసు చేధించిన మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి, సీఐలు రాఘవేందర్, నరసింహారావు, జితేందర్ రెడ్డి, మహా లక్ష్మయ్య, ఎస్ఐలు కృష్ణయ్య, శివకుమార్, రామ్మూర్తిలను ఎస్పీ అభినందించారు.