ప్రపంచంలోనే ఖరీదైన ఇంజెక్షన్.. ఒక్క డోసు రూ.16 కోట్లు

ప్రపంచంలోనే ఖరీదైన ఇంజెక్షన్.. ఒక్క డోసు రూ.16 కోట్లు

బెంగళూరు: అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న ముగ్గురు పిల్లల గురించి తెలుసుకుంటే ఎవరికైనా కన్నీళ్లు వచ్చేస్తాయి. రెండేళ్ల వయస్సున్న ఈ ముగ్గురిలో ఒకరిది బెంగళూరు కాగా, మరో ఇద్దరు చిన్నారులది హైదరాబాద్. ఈ ముగ్గురూ అరుదైన జన్యువ్యాధితో బాధపడుతున్నారు. వీరిని బతికించడానికి ఏకైక మార్గం.. జోల్‌‌గెన్‌‌స్మా అనే ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ ఒక్క డోసు ఖరీదు అక్షరాలా రూ.16 కోట్లు. దిగుమతి సుంకం ఆరు కోట్లు అదనం. అంటే మొత్తంగా రూ.22 కోట్లు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఈ చిన్నారులకు ఇంత మొత్తాన్ని సమకూర్చుకొని ట్రీట్‌మెంట్ చేయించడం సాధ్యం కాని పనే. కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది నోవార్టిస్ కంపెనీ. 

ఔషధ సంస్థ అయిన నొవార్టిస్.. లక్కీ విన్నర్స్‌ డ్రా ద్వారా ఈ ముగ్గురిని కాపాడాలని నిశ్చయించుకుంది. వీరి వైద్య ఖర్చులకయ్యే మొత్తాన్ని భరించడానికి ముందుకొచ్చింది. చిన్నారుల ట్రీట్‌‌మెంట్‌కు అవసరమైన మందులను యూఎస్‌ నుంచి ఈనెల 16న తెప్పించింది. గురువారం నుంచి వీరికి ట్రీట్‌మెంట్‌ను మొదలుపెట్టింది. రీసెంట్‌గా ఇలాంటి ఓ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. సిటీకి చెందిన అయాన్ష్‌ అనే చిన్నారి కూడా అరుదైన జన్యువ్యాధితో బాధపడుతున్నాడు. అతడి ట్రీట్‌మెంట్‌లోనూ జోల్‌‌గెనెస్మా ఇంజెక్షన్‌నే వాడారు. అయితే ట్రీట్‌మెంట్ కోసం డబ్బుల్లేక బాధపడుతున్న అయాన్ష్‌ ఫ్యామిలీకి సాయం చేసేందుకు సెలబ్రిటీలతోపాటు సామాన్య జనం ముందుకొచ్చారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు సమకూరడంతో జూన్ 9న రెయిన్‌బో పిల్లల ఆస్పత్రిలో అయాన్ష్‌కు ఇంజెక్షన్ చేశారు.