
ఇంఫాల్: మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. తెంగ్నౌపాల్ జిల్లా పల్లెల్‌లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరో 45 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారికి ఇంఫాల్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.
కాల్పుల విషయం వేగంగా వ్యాప్తి చెందడంతో తౌబల్, కక్చింగ్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పల్లెల్‌కు చేరుకున్నారు. అయితే, వారిని అస్సాం రైఫిల్స్ సిబ్బంది అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడిందని అధికారులు వివరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అస్సాం రైఫిల్స్ టియర్ గ్యాస్ షెల్స్‌ను లాబ్ చేయడంతో ఓ జవానుతోపాటు 45 మందికి పైగా మహిళలు గాయపడ్డారని వెల్లడించారు.