
మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజ్ సమీపంలో జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ కొన్నాయి. మంటలు చెలరేగడంతో రెండు లారీల డ్రైవర్లు, ఒక క్లీనర్ సజీవ దహనం అయ్యారు.
విజయవాడ నుంచి చేపల ఎరువు లోడ్ తో గుజరాత్ వెళ్తున్న లారీ... వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న గ్రానైట్ లారీ ఒకదానినొకటి ఢీ కొట్టింది. దీంతో గ్రానైట్ లారీపై ఉన్న బండ ఎదుటి లారిపై పడటంతో డ్రైవర్లు అందులోనే ఇరుక్కుపోయారు. మంటలు చెలరేగడంతో బయటికి రాలేక అందులోనే ముగ్గురు సజీవ దహనం అయ్యారు.
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఖమ్మం వరంగల్ హైవేపై కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.