చత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్‍: ఇద్దరు మావోయిస్టుల హతం

చత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్‍: ఇద్దరు మావోయిస్టుల హతం

వెలుగు: తెలంగాణ, చత్తీస్ గఢ్ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌ లో ఆదివారం ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. చత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడు అడవుల్లో తెలంగాణ గ్రేహౌండ్స్, చత్తీస్ గఢ్ పోలీసులు కూంబింగ్ చేస్తుండగా ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారని, ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారని బీజాపూర్ ఎస్పీ గోవర్దన్​ ఠాగూర్ తెలిపారు. మిగిలినవారు అడవిలోకి పారిపోయారని, ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇంకా బలగాలు అడవుల్లోనే ఉన్నాయని, మరికొన్ని బృందాలను పంపుతున్నట్లు చెప్పారు.

ప్రతీకారానికి స్కెచ్
ఈ నెల 18న దంతెవాడ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌‌‌‌లో మలాంగిర్ ఏరియా కమిటీ కార్యదర్శి వర్గీస్ తోపాటు మరో మహిళా మావోయిస్టు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టులు దంతెవాడ–అరణ్ పూర్ మార్గాన్ని ఆదివారం మూసివేశారు. చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా వేసి వాటికింద మందుపాతరలు అమర్చారు. రోడ్డు క్లియర్ చేసేందుకు వెళ్లిన బలగాలు మందుపాతరలను గుర్తించి నిర్వీర్యం చేశాయి. ఐదు కిలోల శక్తివంతమైన పేలుడు పదార్థాలను ఇందులో వాడినట్టు పోలీసులు గుర్తించారు. వర్గీస్ ఎన్‌ కౌంటర్‌‌‌‌తో రగిలిపోతున్న మావోయిస్టులు భద్రతా బలగాలను రప్పించేందుకే దారి మూసివేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.

15 మంది మావోయిస్టుల లొంగుబాటు
బీజాపూర్ ఎస్పీ గోవర్దన్​ఠాగూర్ ఎదుట ఆదివారం15 మంది మావోయిస్టులు ఆయుధాలతోసహా లొంగిపోయారు. వీరిలో ముగ్గురు పురుషులు, 12 మందిమహిళలు ఉన్నారు.