కరీంనగర్‌‌‌‌ జిల్లాలో చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు మృతి

కరీంనగర్‌‌‌‌ జిల్లాలో చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు మృతి

తిమ్మాపూర్, వెలుగు : చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన కరీంనగర్‌‌‌‌ జిల్లాలోని ఎల్‌‌‌‌ఎండీ వద్ద బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌‌‌‌ పట్టణానికి చెందిన సయ్యద్‌‌‌‌ సర్వర్ (52), అతడి తమ్ముడి కొడుకు సయ్యద్ రిజ్వాన్‌‌‌‌ (20), మరో వ్యక్తి మహ్మద్ ఇసాక్‌‌‌‌ కలిసి మానేరు డ్యాంలో చేపలు పట్టేందుకు బుధవారం ఉదయం వెళ్లారు. మహాత్మానగర్‌‌‌‌లోని తాపాలగుట్ట సమీపంలో చేపలు పడుతుండగా రిజ్వాన్‌‌‌‌ ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయాడు. 

గమనించిన సర్వర్‌‌‌‌.. రిజ్వాన్‌‌‌‌ను కాపాడేందుకు ప్రయత్నించగా అతడు కూడా నీటిలో మునిగాడు. కొద్ది దూరంలో ఉన్న ఇసాక్‌‌‌‌తో పాటు అక్కడే చేపలు పడుతున్న మరికొందరు ఇద్దరినీ కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న సీఐ సదన్‌‌‌‌ కుమార్, ఎస్సై శ్రీకాంత్‌‌‌‌గౌడ్‌‌‌‌ ఘటనా స్థలానికి చేరుకొని నీటిలో గాలించగా ఇద్దరి డెడ్‌‌‌‌బాడీలు దొరికాయి. మృతుల కుటుంబసభ్యులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్‌‌‌‌గౌడ్‌‌‌‌ తెలిపారు.

కొత్తగూడలో యువకుడు గల్లంతు

కొత్తగూడ, వెలుగు : చేపలు పట్టేందుకు వెళ్లి ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన మహబూబాబాద్‌‌‌‌ జిల్లా కొత్తగూడలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తగూడకు చెందిన ఆగబోయిన నరేశ్‌‌‌‌ (25) బుధవారం చేపలు పట్టేందుకు ఓటాయి రోడ్డులోని రాళ్లతొట్టి వాగు వద్దకు వెళ్లాడు. అక్కడ చేపలు పడుతుండగా.. వరద ఉధృతికి నీటిలో కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న కొందరు గమనించి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ తిరుపతిరావు, సీఐ సూర్యప్రకాశ్, ఇన్‌‌‌‌చార్జి ఎస్సై రవికుమార్, తహసీల్దార్‌‌‌‌ రాజు, ఎంపీడీవో రోజారాణి వాగు వద్దకు చేరుకొని గ్రామస్తుల సహకారంతో గాలింపు చేపట్టినా నరేశ్‌‌‌‌ ఆచూకీ దొరకలేదు.