అప్పుల బాధతో ఇద్దరు ఆత్మహత్య

అప్పుల బాధతో ఇద్దరు ఆత్మహత్య

బోథ్/దుబ్బాక, వెలుగు: అప్పులబాధతో వేర్వేరుచోట్ల ఇద్దరు ఆత్మహత్య  చేసుకున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకరాం.. ఆదిలాబాద్​జిల్లా బోథ్​మండలం సాయినగర్ కు చెందిన ఆనందపు రవితేజ(24) మార్కండేయ ఆలయ రోడ్డులో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. దాంతోపాటు ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. 

మెడికల్ షాప్ లో నష్టం రావడంతోపాటు వ్యవసాయంలో ఆశించిన దిగుబడి రాలేదు. దీంతో రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు ఎలా తీర్చాలోనని కుటుంబ సభ్యులతో చర్చిస్తూ రోజూ బాధపడేవాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం పొలం వద్ద పురుగుల మందు తాగాడు. అనంతరం విషయాన్ని తన స్నేహితులకు ఫోన్​ చేసి చెప్పాడు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని అతడిని నిర్మల్​ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రవితేజ చనిపోయాడు. మృతుడికి తల్లి, సోదరుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ప్రవీణ్​కుమార్​ తెలిపారు. 

పద్మనాభునిపల్లిలో.. 

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామానికి చెందిన ముక్కపల్లి కనకయ్య(38) మూడేళ్ల కింద వ్యవసాయం కోసం అప్పులు చేసి ట్రాక్టర్, కిరాయిల కోసం క్వాలీస్​ వాహనం కొన్నాడు. కానీ లాభం లేకపోవడంతో ట్రాక్టర్, క్వాలీస్​ వాహనాన్ని తిరిగి అమ్మేశాడు. ఈ క్రమంలో రూ. 5లక్షల వరకు అప్పులు మిగిలాయి. కాగా కనకయ్య శుక్రవారం మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాడు. ఒక్కసారిగా వాంతులు చేసుకొని స్పృహకోల్పోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆటోలో సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చిన కనకయ్యను ఏమైందని అడుగగా అప్పుల బాధతో పొలం వద్ద మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగినట్లు తెలిపాడు. 

మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​లోని గాంధీ హాస్పిటల్​కు  తరలించాలని డాక్టర్లు సూచించారు. కానీ కుటుంబ సభ్యులు రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు తరలించారు. అక్కడ కనకయ్యను పరీక్షించేలోపే అతడు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడికి తల్లి, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గంగరాజు తెలిపారు.