ఆరుగురి హత్య కేసులో మరో రెండు డెడ్​బాడీల గుర్తింపు

ఆరుగురి హత్య కేసులో మరో రెండు డెడ్​బాడీల గుర్తింపు
  •     మాక్లూర్​లో పూడ్చిన ప్రసాద్ శవం వెలికితీత
  •     నవీపేట యంచ గోదావరి ఒడ్డున దొరికిన శాన్విక శవం

కామారెడ్డి/ నిజామాబాద్, వెలుగు : ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య కేసులో మరో రెండు డెడ్​బాడీలను గురువారం పోలీసులు గుర్తించారు. హత్యలతో సంబంధమున్న ముగ్గురిని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు శవాలను ఐడెంటిఫై చేశారు. నిజామాబాద్​ జిల్లా మాక్లుర్ ​మండలం మదన్​పల్లిలో పూనె ప్రసాద్​శవాన్ని తవ్వి తీయించిన పోలీసులు..డాక్టర్లతో అక్కడే పోస్టుమార్టం పూర్తి చేయించారు. ప్రసాద్​కు మద్యం తాగించి చంపిన నిందితులు అక్కడే పూడ్చిపెట్టారు. తర్వాత నవీపేటలోని యంచ గ్రామం పక్కన ఉన్న గోదావరి ఒడ్డున ప్రసాద్​ భార్య శాన్విక అలియాస్​రమణి డెడ్​బాడీని గుర్తించారు. పూర్తిగా కుళ్లిన స్థితిలో ఆమె శవం లభ్యమైంది. 

మాక్లూర్ లోని పూనె ప్రసాద్​ ఇంటిపై లోన్ ​ఇప్పిస్తానని నమ్మించిన అతడి స్నేహితుడు ప్రశాంత్​ఆ ఇంటిని తన పేరుపై మార్చుకున్నాడు. తర్వాత ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు ఒకరికి తెలియకుండా ఒకరిని మొత్తం ఆరుగురు కుటుంబీకులను వేర్వేరు ప్రాంతాల్లో హత్య చేశాడు. ఈ కేసులో ఐదుగురు నిందితులను ఈ నెల19న కామారెడ్డి జిల్లా సదాశివ్​నగర్ ​పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు పంపారు. పూనె ప్రసాద్​తో పా టు ఇతడి భార్య శాన్విక అలియాస్​ రమణి, కవల పిల్లలు చైత్రిక్, చైత్రిక, చెల్లెళ్లు శ్రావణి, స్వప్న హత్యకు గురికాగా, చైత్రిక్, చైత్రిక, శ్రావణి, స్వప్న డెడ్​బాడీలను ఇదివరకే గుర్తించారు. తాజాగా నిందితుడు ప్రశాంత్, ఇతడికి సహకరించిన వంశీ, విష్ణులు ఇచ్చిన సమాచారం మేరకు మిగిలిన రెండు మృతదేహాలను కనుగొన్నారు. తహసీల్దార్​ జాకీర్ సమక్షంలో సీఐ సతీశ్, ఎస్ఐ సుధీర్ శవాలకు పంచనామా, పోస్టుమార్టం నిర్వహించారు.