మరో ఇద్దరు పసికందుల కన్నుమూత.. రిమ్స్ ప్రమాదంలో ఐదుకు చేరిన మృతులు

మరో ఇద్దరు పసికందుల కన్నుమూత.. రిమ్స్ ప్రమాదంలో ఐదుకు చేరిన మృతులు
  • మరో ఏడుగురు చిన్నారుల పరిస్థితి విషమం 
  • మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​కు తరలింపు
  • మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం
  • ప్రకటించిన హెల్త్​ మినిస్టర్​ దామోదర్ ​రాజనర్సింహా
  • బాధిత కుటుంబాలకు టీఆర్ఎస్ ​చీఫ్​ కవిత పరామర్శ 
  • 50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ 

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. బుధవారం మరో ఇద్దరు చిన్నారులు కన్నుమూశారు. సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఊపిరాడని స్థితిలో అస్వస్థతకు గురైన బజార్ హత్నూర్ కు చెందిన ఆడే నాగుబాయి కూతురు, ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్​కు చెందిన దుర్గాబాయి కూతురు ట్రీట్​మెంట్​పొందుతూ మరణించారు. వీరిలో ఒకరు రిమ్స్​లో చనిపోగా.. మరో శిశువు నీలోఫర్​ ఆస్పత్రికి షిఫ్ట్​ చేస్తుండగా మృతి చెందింది.  

కొద్దిరోజుల కింద నాగుబాయి, దుర్గబాయి ఆడ బిడ్డలకు జన్మనివ్వగా.. శిశువులు 1.25 కిలోల బరువు మాత్రమే ఉండడంతో రిమ్స్​లోని స్పెషల్​ నియోనాటల్​కేర్​యూనిట్​లో చేర్చారు. ప్రమాదం జరిగిన వెంటనే వారికి మెరుగైన ట్రీట్​మెంట్ అందించేందుకు ప్రైవేట్​ ఆస్పత్రులకు తరలించినా వారి ప్రాణాలు దక్కలేదు. కాగా, ప్రమాదంలో గాయపడిన వారిలో ఏడుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. 

ప్రస్తుతం 22 మంది వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. వారిలో ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం నాలుగు ప్రత్యేక వాహనాల్లో బుధవారం హైదరాబాద్​లోని కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన ఎస్​ఎన్​సీ యూ వార్డును రిమ్స్ అధికారులు సీజ్ చేశారు. కౌంటర్​ ఇంటెలిజెన్స్​ డీఐజీ ఆర్ భాస్కరన్ బుధవారం రిమ్స్ హాస్పిటల్ ను సందర్శించారు. వార్డును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. 

బాధిత కుటుంబాలకు 50 లక్షలు ఎక్స్​గ్రేషియా ఇవ్వాలి: కవిత

చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం ఆమె ఎస్​ఎన్​సీ యూ వార్డును సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో అస్వస్థతకు గురయిన పిల్లల కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వాలన్నారు. 30 నెలలుగా ఈ ప్రాంతానికి సీఎం గానీ, హెల్త్ మినిస్టర్ గానీ రాలేదన్నారు. బడ్జెట్ లో హెల్త్ కు 10 శాతం కేటాయిస్తామని.. 5 శాతం కూడా కేటాయించడం లేదన్నారు. 

నెల రోజుల్లో సీఎం ఇక్కడికొచ్చి పరిస్థితిని సమీక్షించాలని, లేకపోతే ఆదివాసీలతో కలిసి ఘెరావ్ చేస్తామన్నారు. బాధిత కుటుంబసభ్యులకు రూ. 50 వేల చొప్పున కవిత ఆర్థిక సాయం అందించారు. అనంతరం ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. ఆమె వెంట మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తదితరులు ఉన్నారు. 

నిర్లక్ష్యంతోనే ప్రమాదం:  సత్యవతి రాథోడ్

ఆదిలాబాద్ రిమ్స్ లో అధికారుల నిర్లక్ష్యం, సరైన సదుపాయాలు కల్పించకపోడం వల్లే ప్రమాదం జరిగిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం ఆమె రిమ్స్ హాస్పిటల్ ను సందర్శించారు. బాధిత కుటుంబాలకు బీఆర్‌‌‌‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరఫున రూ. లక్ష చొప్పున సాయం అందించనున్నట్టు తెలిపారు. 

చనిపోయిన పిల్లల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ. 10లక్షల చొప్పున  ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న శిశువుల వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించాలన్నారు. ఆమె వెంట మాజీ మంత్రి జోగురామన్న, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవలక్ష్మి, ఖానాపూర్ ఇన్ చార్జి జాన్సన్ నాయక్ ఉన్నారు.  

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియా

రిమ్స్ అగ్ని ప్రమాద ఘటనలో మృతిచెందిన చిన్నారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియా ప్రకటించింది. సీఎం రేవంత్ ​రెడ్డి ఆదేశాల మేరకు ఈ పరిహారాన్ని అందించనున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారని ఆదిలాబాద్​ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.

ప్రస్తుతం జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని మంత్రి తెలుసుకున్నారని, అవసరమైతే వారిని హైదరాబాద్‌‌లోని కార్పొరేట్, ప్రభుత్వ సూపర్‌‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించారన్నారు. రిమ్స్‌‌లో 150 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్‌‌) నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించనున్నట్టు మంత్రి ప్రకటించారని కలెక్టర్​ చెప్పారు.