- పర్మిషన్, రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి, వెలుగు: లింగ నిర్ధారణ పరీక్ష చేసి ఇద్దరు గర్భిణులకు అబార్షన్లు చేసిన కేసులో హాస్పిటల్పర్మిషన్తో పాటు డయాగ్నోస్టిక్ సెంటర్ రిజిస్ట్రేషన్‌ను కలెక్టర్ రద్దు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వీరవెల్లి, తుర్కపల్లి మండలం పెద్దతండాకు చెందిన ఇద్దరు గర్భిణులు ఈ ఏడాది జులైలో భువనగిరిలోని ఎస్ఎల్ఎన్ఎస్ డయాగ్నోస్టిక్సెంటర్లో డాక్టర్ పాండు గౌడ్వద్ద లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.
కడుపులో ఉన్నది అమ్మాయిలు అని తేలడంతో వీరిద్దరు భువనగిరిలోని గాయత్రి హాస్పిటల్లో డాక్టర్హీరేకార్శివకుమార్వద్ద జులై 6న అబార్షన్ చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న భువనగిరి ఎస్వోటీ పోలీసులు మరుసటి రోజు తెల్లవారుజామున హాస్పిటల్‌పై దాడులు నిర్వహించారు. అబార్షన్ చేసి వెలికి తీసిన పిండాలను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ శివకుమార్, డాక్టర్పాండు గౌడ్‌పై కేసులు నమోదు చేశారు.
కలెక్టర్ ఆదేశాలతో విచారణ..
అబార్షన్ల ఘటనపై కలెక్టర్ హనుమంతరావు ఆదేశాలతో జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ, అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ హెల్త్ టీంలు విచారణ జరిపాయి. డాక్టర్ శివకుమార్ ఎంబీబీఎస్పాస్కాకున్నా డాక్టర్‌గా చెలామణి అవుతున్నట్లు తేలింది. ఎస్ఎల్ఎన్ఎస్ డయాగ్నోస్టిక్ సెంటర్లోని ఫారం -ఎఫ్ రికార్డుల్లో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించారు. హాస్పిటల్‌తో పాటు డయాగ్నోస్టిక్ సెంటర్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. నిర్వాహకులు ఇచ్చిన వివరణ సరిగ్గా లేకపోవడంతో అన్ని రిజిస్ట్రేషన్లు, పర్మిషన్లను రద్దు చేస్తూ కలెక్టర్ హనుమంతరావు శనివారం ఆదేశాలు జారీ చేశారు.
