కేసీఆర్​ నీళ్ల డ్రామాలను అసెంబ్లీలో కడిగేద్దాం : సీఎం రేవంత్​రెడ్డి

కేసీఆర్​ నీళ్ల డ్రామాలను అసెంబ్లీలో కడిగేద్దాం : సీఎం రేవంత్​రెడ్డి
 • నీటి వాటాలు తేలేదాకా ప్రాజెక్టులను అప్పగించేది లేదు
 • అప్పగింతకు ఓకే చెప్పిందే కేసీఆర్​.. ఏపీ నీళ్ల దోపిడీకి వంతపాడిండు
 • అప్పుడు తప్పులు చేసి ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నడు
 • వాటన్నింటినీ ఎండగట్టాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచన!
 • ప్రాజెక్టుల పరిస్థితిపై ప్రజాభవన్​లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన 
 • కృష్ణా జలాలపై నేడు అసెంబ్లీలో రెండు తీర్మానాలు
 • ప్రాజెక్టులను కేఆర్​ఎంబీకి అప్పగించకుండా ఒక తీర్మానం
 • ‘సాగర్​’ ​పైనుంచి సీఆర్పీఎఫ్​ బలగాలను వెనక్కి తీసుకునేలా మరో తీర్మానం
 • కృష్ణా బేసిన్​లో మళ్లీ ఫ్రెష్​గా నీటి వాటాలు తేల్చేలా కేంద్రంపై పోరాటం
 • నేడో రేపో ఇరిగేషన్​పై అసెంబ్లీలో వైట్​ పేపర్​ రిలీజ్​
 • వాస్తవాలను జనం ముందు ఉంచుదాం
 • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్​ దిశానిర్దేశం

హైదరాబాద్, వెలుగు: నీటి ప్రాజెక్టుల పేరిట కేసీఆర్​ పాలనలో జరిగిన అక్రమాలను జనం ముందుంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మన నీళ్లను ఏపీ ఎత్తుకుపోయేలా కేసీఆర్​ ఏ విధంగా సహకరించారనేది కండ్లకు కట్టినట్టు వివరించేందుకు సమాయత్తమవుతున్నది. కేసీఆర్​ నీళ్ల డ్రామాలను అసెంబ్లీ వేదికగా కడిగేద్దామని కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్​రెడ్డి దిశానిర్దేశం చేశారు. బీఆర్​ఎస్​ తప్పులను ఎండగడుదామని,  ప్రజలకు వాస్తవాలను వివరిద్దామని ఆయన సూచించారు. ఇందుకోసం సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెప్పారు. కాళేశ్వరం సహా ఇరిగేషన్​ ప్రాజెక్టులు, కేఆర్​ఎంబీ అంశాలపై ఆదివారం ప్రజాభవన్​లో కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో  సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్​బాబు తదితరులు పాల్గొన్నారు. పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ద్వారా ఇరిగేషన్​పై మంత్రి ఉత్తమ్​ అవగాహన కల్పించారు. 

కృష్ణా, గోదావరి బేసిన్లు, వాటిపై ఉన్న ప్రాజెక్టుల గురించి వివరించారు. తెలంగాణ, ఏపీలో ఉన్న ప్రాజెక్టులు, రాష్ట్రాలకు రావాల్సిన న్యాయమైన నీటి వాటాలపై ఆయన వెల్లడించారు. కాగా, అధికారంలో ఉన్నన్నాళ్లూ ఏపీ నీళ్ల దోపిడీకి వంతపాడిన కేసీఆర్​.. ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని, ఆ డ్రామాలను అసెంబ్లీ, మండలి సమావేశాల్లో కడిగేద్దామని ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్​రెడ్డి సూచించినట్లు సమాచారం. ఒకటీ రెండు రోజుల్లో ప్రాజెక్టులపై అసెంబ్లీలో వైట్​ పేపర్​ను రిలీజ్​ చేసి.. బీఆర్​ఎస్​ నుంచి సమాధానాలు రాబడుదామని అన్నట్లు తెలిసింది. కృష్ణా ప్రాజెక్టులతోపాటు గోదావరి బేసిన్​లోని ప్రాజెక్టులపైనా బీఆర్​ఎస్​ అబద్ధాలను ప్రచారం చేస్తున్నదని, వాటన్నింటినీ తిప్పికొట్టేలా ప్రతి జిల్లాలోనూ కౌంటర్​ నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.  

దొంగ జీవోలతో ఏపీకి నీళ్లు

బీఆర్​ఎస్​ ప్రభుత్వం దొంగ జీవోలతో ఏపీకి నీళ్లు ఎలా ఇచ్చిందో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​లో వివరించారు. నీటి వాటాల విషయంలో పలు సందర్భాల్లో కేసీఆర్, ఏపీ సీఎం జగన్  చేసిన కామెంట్లనూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినిపించారు. వారిద్దరూ కలిసి నీళ్ల డ్రామా ఎలా ఆడారో చూపించి.. దాన్ని అసెంబ్లీలో ఎండగట్టేందుకు దిశానిర్దేశం చేశారు. నీటి వాటాల పంపకం కోసం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్, కేఆర్​ఎంబీ ఏర్పాటు, కృష్ణా బేసిన్​లోని రాష్ట్రాలతో సమావేశాలు, ఆ సమావేశాల మినిట్స్​ వివరాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గురించి అవగాహన కల్పించారు. వాటిలోని సాంకేతిక అంశాలతో పాటు రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలు, నష్టాలను పూసగుచ్చినట్టు వివరించారు. దాంతో పాటు ప్రాజెక్టుల విషయంలో బీఆర్​ఎస్​ వైఖరి, కాంట్రాక్టులు అప్పగించిన తీరు, ఆ పార్టీ నేతలు పాల్పడిన అవినీతిని వివరించడంతో పాటు వాటికి అసెంబ్లీలో కౌంటర్​ ఎట్లా ఇవ్వాలన్న విషయంపైనా నేతలకు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ప్రాజెక్టులపై వైట్​పేపర్​ రిలీజ్​ చేస్తున్నందున బీఆర్​ఎస్​నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉందని, అందుకు దీటుగా కౌంటర్​ ఇచ్చేందుకు రెడీ ఉండాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. 

Also Read : కేసీఆర్​..! నల్గొండకు వచ్చే ముందు .. ముక్కు నేలకు రాసి రా : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

బీఆర్​ఎస్​ సమాధానం చెప్పాల్సిందే: ఐలయ్య

కృష్ణా జలాలపై అసెంబ్లీలో క్లారిటీ ఇస్తామని ప్రభుత్వ విప్​, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. తాము అడిగే ప్రశ్నలకు బీఆర్​ఎస్​ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్​ చేశారు. నల్గొండలో కేసీఆర్​ మీటింగ్​ స్టార్ట్​ అయ్యేలోపు ప్రాజెక్టులపై ప్రజలకు నిజాలను వివరిస్తామన్నారు. నీళ్లను జగన్​ కోసం ఏపీకి కేసీఆర్​ తరలించారని, ఇప్పుడు సెంటిమెంట్​ వాడుకుందామంటే ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. నీళ్ల విషయంలో ఏపీకి కేసీఆర్​ సాయం చేశారని సాక్షాత్తూ జగనే ఏపీ అసెంబ్లీలో ప్రకటించారని గుర్తు చేశారు. సెంటిమెంట్​ రగిల్చి ఓట్లు దండుకోవాలన్న కుట్రల్లో కేసీఆర్​ దిట్ట అని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం పోలింగ్​ రోజు డ్రామాలు చేశారన్నారు. ఇరిగేషన్​ ప్రాజెక్టుల్లో నిధులు దోచుకుని ఎన్నికలకు వాడుకున్నారని ఆరోపించారు. 
 
జగన్​తో కేసీఆర్​ కుమ్మక్కైండు: మహేశ్​ కుమార్​ 

జగన్​తో కేసీఆర్​ కుమ్మక్కై తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఎమ్మెల్సీ, పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​గౌడ్​ ఫైర్​ అయ్యారు. ఏపీకి కృష్ణా నీళ్లను ధారాదత్తం చేశారన్నారు. నీళ్ల విషయంలో ఉమ్మడి ఏపీలో తెలంగాణకు జరిగిన అన్యాయం కంటే.. కేసీఆర్​ చేసిన అన్యాయమే ఎక్కువని మండిపడ్డారు. కృష్ణా జలాలపై బీఆర్​ఎస్​ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీలోనే తిప్పి కొడతామని తేల్చిచెప్పారు. బీఆర్​ఎస్​ నాయకులవన్నీ అబద్ధాలేనన్నారు. ప్రాజెక్టుల పేరిట రూ.లక్ష కోట్లు లూటీ చేశారని ఆయన ఆరోపించారు. ప్రజల ప్రయోజనాల కోసం పోరాడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.  

కేసీఆర్​, జగన్​ నాటకాలు: ఆది శ్రీనివాస్​

కేసీఆర్, జగన్​ ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాతే నాగార్జునసాగర్​పైకి ఇరు రాష్ట్రాల పోలీసులూ ఎంటరై గొడవ పెట్టుకున్నారని ప్రభుత్వ విప్​, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​ అన్నారు. కేసీఆర్​, జగన్​ ఇద్దరూ కలిసే నాటకాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్​ చేసిన నిర్వాకం వల్ల దక్షిణ తెలంగాణ మొత్తం ఎడారిగా మారే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేసీఆర్​ కృష్ణా జలాలపై పోరాటం అంటూ డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు. తెలంగాణకు ఉమ్మడి పాలకులు చేసిన అన్యాయం కంటే కేసీఆర్​ చేసిన అన్యాయమే ఎక్కువన్నారు. 

అప్పగించిందే కేసీఆర్​

కేఆర్​ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించిందే కేసీఆర్​ అని, కానీ ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్​ అన్నారు. నీటి వాటాలు తేల్చేంతవరకు ప్రాజెక్టులను కేఆర్​ఎంబీకి అప్పగించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కేఆర్​ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తున్నట్లుగా తానుగానీ, ప్రస్తుత ఇరిగేషన్​ సెక్రటరీ రాహుల్​ బొజ్జా గానీ సంతకాలు చేయలేదని తేల్చిచెప్పారు. ప్రాజెక్టులను మళ్లీ రాష్ట్రం పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఉద్యమించాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా సోమవారం అసెంబ్లీలో రెండు తీర్మానాలను ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్​రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో ఒకటి.. ప్రాజెక్టులను కేఆర్​ఎంబీకి అప్పగించేది లేదని కేంద్రానికి తేల్చి చెప్పే తీర్మానం కాగా.. రెండోది నాగార్జునసాగర్​ డ్యామ్​పై మోహరించిన సీఆర్పీఎఫ్​ బలగాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్​తో కూడిన తీర్మానమని సమాచారం. 

నీటి వాటాల కోసం కొట్లాటే..

ప్రస్తుతం కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు ఇస్తున్నారు. నీళ్ల వాటా తగ్గడానికి గత కేసీఆర్​ సర్కారు తీరే కారణమని ప్రస్తుత ప్రభుత్వం మండిపడుతున్నది. నీళ్లలో న్యాయమైన వాటా కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు రెడీ అయింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కృష్ణా బేసిన్​లోని రాష్ట్రాలన్నింటికీ (మహారాష్ట్ర, కర్నాటక సహా) మరోసారి నీటి వాటాల పంపిణీ కోసం ఉద్యమించాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్​రెడ్డి చెప్పినట్టు తెలుస్తున్నది.