బ్లాక్ లిస్ట్ లో రెండు రైస్ మిల్లులు : మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్

బ్లాక్ లిస్ట్ లో రెండు రైస్ మిల్లులు : మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్
  •     కస్టమ్ మిల్లింగ్ ఆపరేషన్​ లో పాల్గొననందుకు చర్యలు 

మెదక్​, వెలుగు: ధాన్యం దిగుమతుల్లో అలసత్వం వహించిన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేటాయించిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోనందుకు రెండు రైస్ మిల్లులను బ్లాక్‌‌‌‌లిస్ట్‌‌‌‌లో చేర్చినట్లు మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేందుకు అన్ని రైస్ మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని దిగుమతి చేసుకుని కస్టమ్ మిల్లింగ్ ఆపరేషన్‌‌‌‌లో త ప్పనిసరిగా పాల్గొనాలని పలుమార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. అయినప్పటికీ కొంతమంది మిల్లర్లు ఆ ఆదేశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల నుంచి కేటాయించిన ధాన్యం దిగుమతిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాపన్నపేట మండలంలోని మెసర్స్ శ్రీ సాయి లక్ష్మీ ట్రేడర్స్, రామాయంపేట మండలంలోని మెసర్స్ భవాని ఇండస్ట్రీస్‌‌‌‌లను బ్లాక్‌‌‌‌లిస్ట్‌‌‌‌ లో చేర్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. మిల్లర్ల నిర్లక్ష్యం వల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుండటంతో పాటు ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుందని తెలిపారు. 

ఈ నేపథ్యంలో సంబంధిత జి.ఓ నిబంధనల ప్రకారం ఆ రెండు రైస్ మిల్లులను పాడి ప్రొక్యూర్‌‌‌‌మెంట్ మరియు కస్టమ్ మిల్లింగ్ ఆపరేషన్స్ నుంచి తప్పించినట్లు స్పష్టం చేశారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయా రైస్ మిల్లులకు ఎటువంటి ధాన్యం కేటాయింపు చేయబడదని వెల్లడించారు. అలాగే జిల్లాలోని అన్ని రైస్ మిల్లర్లు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తూ పీపీసీల నుంచి ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని, లేనిపక్షంలో సంబంధిత రైస్ మిల్లులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.