కామారెడ్డి, వెలుగు : నాన్ వెజ్ ఎందుకు వండలేదని ప్రశ్నించడంతో పాటు కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగింది. కామారెడ్డి టౌన్ సీఐ నరహరి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో ఉన్న గోసంగికాలనీకి చెందిన కోదండ శివ ( 28), అతడి భార్య లక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం పనికి వెళ్లిన శివ రాత్రి ఇంటికి వచ్చి.. నాన్‌వెజ్ ఎందుకు వండలేదని భార్య లక్ష్మిని ప్రశ్నించాడు.
ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన లక్ష్మి కొడవలితో శివపై దాడి చేసింది. మెడపై తీవ్ర గాయం కావడంతో శివ అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు.
చందానగర్ హోటల్‌లో మహిళ హత్య
చందానగర్, వెలుగు : ఓ హోటల్ గదిలో మహిళ హత్యకు గురైంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఆదివారం వెలుగుచూసింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఇంద్రేశం గ్రామానికి చెందిన నర్సమ్మ (39) హౌస్ కీపింగ్ పనులు చేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో శనివారం మధ్యాహ్నం చందానగర్‌లోని ఓ హోటల్‌కు వచ్చి రూం తీసుకున్నారు.
ఆదివారం ఉదయం వరకు బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది డోర్ పగులగొట్టి చూడగా.. మహిళ అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే చందానగర్పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి చూసేసరికే చనిపోయింది. కాగా, మహిళతో పాటు వచ్చిన వ్యక్తే మెడకు చున్నీ బిగించి హత్య చేసి, పారి పోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

