సౌతాఫ్రికా నుంచి ఇండియా వచ్చిన ఇద్దరికి కరోనా

V6 Velugu Posted on Nov 27, 2021

సౌతాఫ్రికాలో గుర్తించిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై భారత్ అప్రమత్తమైంది. ఆ దేశంతో పాటు ఒమిక్రాన్ కేసులున్న దేశాల నుంచి వచ్చే వాళ్లకు ఎయిర్‌‌పోర్టుల్లోనే టెస్టులు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. అలాగే వారి శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపాలని ఆదేశించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మహారాష్ట్ర, ఢిల్లీ సహా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే కరోనా ఆంక్షలను కూడా కట్టుదిట్టం చేశాయి. అయితే సౌతాఫ్రికా నుంచి ఇటీవలే బెంగళూరుకు వచ్చిన ఇద్దరికి టెస్టు చేయగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో అధికారులు వాళ్ల శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా.. ఒమిక్రాన్ వేరియంట్ కాదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరికీ డెల్టా వేరియంట్ సోకినట్లు తేల్చారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వేగంగా జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టామని, రెండు శాంపిల్స్ కూడా ఒమిక్రాన్ కాదని, డెల్టా అని తేలిందని కర్ణాటక రాష్ట్ర హెల్త్ సెక్రెటరీ టీకే అనీల్ కుమార్ చెప్పారు. ఈ నెలలోనే కొద్ది రోజుల క్రితం వాళ్లిద్దరూ సౌతాఫ్రికా నుంచి తిరిగి వచ్చారన్నారు. వీరి శాంపిల్స్‌ను బెంగళూరులోని ల్యాబ్‌లోనే జీనోమ్ సీక్వెన్సింగ్ చేసినట్లు తెలిపారు. గడిచిన కొన్ని వారాల్లో సౌతాఫ్రికా నుంచి 94 మంది వచ్చారని చెప్పారు. కాగా, ఒమిక్రాన్ వేరియంట్‌ను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిన్ననే రివ్యూ చేశామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ తెలిపారు. ఈ వేరియంట్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని, ఒక వేళ పాజిటివ్ అని తేలితే ఎయిర్‌‌పోర్టులోనే ట్రీట్‌మెంట్ అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని అన్నారు. ఇందుకోసం బెంగళూరు ఎయిర్‌‌పోర్టులో ప్రత్యేకంగా హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులను ఉంచామన్నారు. పాజిటివ్ రాకపోయినా క్వారంటైన్ పీరియడ్ పూర్తయ్యే వరకూ ఇంట్లోనే ఉండాలని చెప్పారు.

పది రోజుల్లో రెండోసారి టెస్టులు చేస్తాం

కొద్ది రోజులుగా సౌతాఫ్రికా నుంచి కర్ణాటకకు వచ్చినవారందరికీ ఇప్పటికే కరోనా టెస్టులు చేశామని ఆ రాష్ట్ర మంత్రి ఆర్ అశోక్ తెలిపారు. మరో పది రోజుల తర్వాత అందరికీ రెండోసారి టెస్టులు చేస్తామని ఆయన తెలిపారు.

Tagged south africa, Bengaluru, Corona Positive, covid test, Delta variant, Omicron variant

Latest Videos

Subscribe Now

More News