తోటి స్టూడెంట్లు ఎగతాళి చేశారని ఆత్మహత్యాయత్నం!

తోటి స్టూడెంట్లు ఎగతాళి చేశారని ఆత్మహత్యాయత్నం!

శాయంపేట, వెలుగు: హనుమకొండ జిల్లాలోని ఓ కేజీబీవీలో ఇద్దరు స్టూడెంట్లు నెయిల్ పాలిష్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. టీచర్లు గమనించి హాస్పిటల్​కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండకు చెందిన కల్పన శాయంపేట మండలం తహరాపూర్​శివారులోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో టెన్త్​చదువుతోంది. మంగళవారం రాత్రి తన క్లాస్​మెట్​పూర్ణతో కలిసి స్కూల్​అటెండర్​ ఫోన్​తో ఇంటికి కాల్​చేసింది. 

తన ఆరోగ్యం బాగోలేదని, వచ్చి ఇంటికి తీసుకెళ్లమని తల్లికి చెప్పింది.  వారిని గమనించిన తోటి స్టూడెంట్లు కల్పన, పూర్ణను దొంగ దొంగ ఎగతాళి చేశారు. తీవ్ర మనస్తాపం చెందిన బాలికలు బుధవారం సాయంత్రం నెయిల్​పాలిష్ తాగారు. గుర్తించిన టీచర్లు వెంటనే వారిని పరకాలలోని గవర్నమెంట్​హాస్పిటల్​కు తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించి చికిత్స అందించారు.

ALSO READ:నైగర్​లో సైనిక తిరుగుబాటు.. అధ్యక్షుడి అరెస్టు, రాజ్యాంగం రద్దు

 గురువారం కుటుంబ సభ్యులను పిలిపించి ఇద్దరు బాలికలను ఇంటికి పంపించారు. ఈ విషయమై కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ మాధవిని వివరణ కోరగా.. కల్పన, పూర్ణ ఇంటికి వెళ్తామని అడగగా, సర్ది చెప్పామని తెలిపారు. పంపించడం లేదనే బాధతో నెయిల్​పాలిష్​తాగారన్నారు. చికిత్స అందించి, ఇంటికి పంపామని స్పష్టం చేశారు. బాలికలు ఇద్దరూ కోలుకున్నారని వెల్లడించారు.