
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. బుధవారం (జూలై 30) తెల్లవారుజామున పూంచ్‌లోని దేఘ్వర్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ గుండా భారత్‌లోకి అక్రమంగా చొరబడటానికి ప్రయత్నించిన ఇద్దరూ ఉగ్రవాదులను సైన్యం కాల్చి పడేసిందని అధికారులు తెలిపారు.
పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్ నిందితులు జమ్మూ కాశ్మీర్లో ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు రాష్ట్రవ్యాప్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ సమీపంలో ఇద్దరూ పాక్ టెర్రరిస్టులను భద్రతా దళాలు గుర్తించాయి. అక్రమంగా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకుని ఇద్దరిని హతం చేశారు. ఘటన స్థలంలో ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని.. అదనపు బలగాలను మోహరించామని అధికారులు తెలిపారు.
ALSO READ | పాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గాం దాక ఎట్లొచ్చిన్రు?: ఖర్గే
కాగా, ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్టులను సోమవారం (జూలై 28) భద్రతా దళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. శ్రీనగర్ దచిగామ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఇందులో పహల్గాం టెర్రర్ ఎటాక్ మాస్టర్ మైండ్ హషీమ్ మూసా కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు బలగాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.