గాలివాన బీభత్సానికి 2 వేల గుడిసెలు నేలమట్టం

గాలివాన బీభత్సానికి 2 వేల గుడిసెలు నేలమట్టం
  • పాక్షికంగా దెబ్బతిన్న వెయ్యి గుడిసెలు 
  • లబోదిబోమంటున్న పేదలు
  • అబ్దుల్లాపూర్​మెట్ రావినారాయణ రెడ్డి కాలనీలోని పరిస్థితి 

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు :  రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం రావినారాయణరెడ్డి కాలనీలో ఆదివారం సాయంత్రం కురిసిన ఈదురు గాలుల వర్షానికి 2 వేల గుడిసెలు నేటమట్టం అయ్యాయి. వెయ్యి గుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈదురు గాలికి గుడిసెలతోపాటు ఇంట్లోని వస్తువులు, వంట సామాగ్రి ఎగిరిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. రావినారాయణరెడ్డి కాలనీలోని భూదాన్​భూమిలో ఏడాదిన్నరగా 8 వేల పేద కుటుంబాలు గుడిసెలు వేసుకుని ఉంటున్నాయి.వీళ్లంతా కూలి పనులకు వెళ్తుంటారు. కొందరు రోడ్డు పక్కన చిరువ్యాపారాలు చేసుకుంటారు.

ఈ గుడిసెలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. కరెంట్, వాటర్​సదుపాయాలు లేవు. సీపీఐ ఆధ్వర్యంలో నిరుపేదలంతా కలిసి ఇక్కడ గుడిసెలు వేసుకున్నారు. గాలివాన దెబ్బకు 2 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సోమవారం ఉదయం గాలికి ఎగిరిపోయిన వస్తువులను అంతా ఏరుకొచ్చుకున్నారు. నేలమట్టమైన గుడిసెలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. గత ప్రభుత్వం తమకు న్యాయం చేయలేదని, కాంగ్రెస్​ప్రభుత్వమైనా పట్టించుకొని ఆదుకోవాలని వేడుకున్నారు.

వేల గుడిసెలు కూలిపోయినా ఏ అధికారి కన్నెత్తి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర నాయకులు అందోజు రవీంద్రచారి మాట్లాడుతూ.. తాము పేదల పక్షాన పోరాటం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, గుడిసెవాసులను ఆదుకోవాలని, అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కోరారు.