జడ్చర్ల, వెలుగు : రెండు ట్రావెల్స్ బస్సులు ఢీకొనడంతో ఒకరు చనిపోగా, మరో 14 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే... టీఎస్08యూఎం1602 నంబర్ గల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తోంది. ఈ బస్సు జడ్చర్ల పట్టణ సమీపంలోకి రాగానే... హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.
ప్రమాదంలో తిరుపతికి చెందిన రిటైర్డ్ డీఎస్పీ సాంబశివారెడ్డి కుమారుడు అశోక్‌రెడ్డి (40) అక్కడికక్కడే చనిపోయాడు. బెంగుళూరు వెళ్తున్న బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా.. రెండు బస్సుల్లో ఉన్న 14 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ కమలాకర్ తెలిపారు. ప్రమాదం కారణంగా ఎన్‌హెచ్ 44పై భారీఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
