
- నిర్మల్‌లో మహిళకు గుండెపోటు
- భైంసా మండలం వానల్ పాడ్‌లో కుప్పకూలిన యువతి
నిర్మల్/ భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లాలో బతుకమ్మ వేడుకల్లో డీజే భారీ శబ్ధాలు విషాదాన్ని నింపాయి. విపరీతమైన డీజే సౌండ్స్ ఇద్దరు మహిళల మరణానికి కారణమయ్యాయి. నిర్మల్ పట్టణం బంగల్ పేట్ కు చెందిన బిట్లింగు భాగ్యలక్ష్మి (56) శనివారం (అక్టోబర్ 04) రాత్రి బతుకమ్మ ఆడుతుండగా డీజే పాటల సౌండ్స్ కు అస్వస్థతకు గురయ్యారు. గుర్తించిన అక్కడి వారు.. ఆమెను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారు.
గుండెపోటుతోనే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. మృతురాలికి భర్తతో పాటు ఓ కూతురు, ఇద్దరు కొడుకులున్నారు.
భైంసా మండలంలో...
నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వానల్ పాడ్ గ్రామంలో శనివారం రాత్రి జరిగిన బ తుకమ్మ వేడుకల్లో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన వాటోలీ రాజు భార్య రుషిత(25) బతుకమ్మ ఆటఆడుతూ ఒక్కసారి కుప్పకూలింది. కుటుంబీకులు గమనించి భైంసాలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. గొల్లమాడకు చెందిన రుషితకు గత మే నెలలో వివాహమైంది. అత్తగారింటి వద్ద మొదటి సారి బతుకమ్మ ఆడుతూ ఆమె కుప్పకూలి చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.