
- కామారెడ్డి జిల్లాలో వెండి కడియాల కోసం వృద్ధురాలిని చంపిన వ్యక్తి
- సూర్యాపేట జిల్లాలో నడిరోడ్డుపై మహిళ గొంతుకోసిన దుండగులు
నస్రుల్లాబాద్, వెలుగు : వెండి కడియాల కోసం ఓ వ్యక్తి వృద్ధురాలిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలో సోమవారం జరిగింది. స్థానికులు, ఎస్సై రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని అంకోల్ తండాకు చెందిన రాధీబాయి (67)కి ఇద్దరు కొడుకులు కాగా ఒకరు ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోగా, మరో కొడుకు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. దీంతో రాధీబాయి తండాలోనే ఒంటరిగా ఉంటోంది.
సోమవారం దీపావళి పండుగ కావడంతో అదే తండాలో ఉంటున్న రాధీబాయి చెల్లెలు గుగులోతు లక్ష్మి రాధీబాయి ఇంటికి వచ్చింది. ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో కిటికీలోంచి చూసింది. ఈ టైంలో వారి ఇంటి ఎదురుగా ఉండే మెగావత్ సవాయిసింగ్ అనే వ్యక్తి రాధీబాయిని కింద పడేసి, ఆమెపై కూర్చొని తలను నేలకేసి కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత ఆమె చేతికి ఉన్న వెండి కడియాలను తీసుకున్నాడు.
ఈ ఘటనను గమనించిన లక్ష్మి గట్టిగా కేకలు వేయడంతో సవాయిసింగ్ తలుపులు తీసి బయటకు వచ్చాడు. అనంతరం లక్ష్మిని సైతం చంపుతానని బెదిరించి, ఆమెపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రాధీబాయి కుమారుడు లాల్‌సింగ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాఘవేంద్ర
తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో...
సూర్యాపేట, వెలుగు : నడిచి వెళ్తున్న ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టిన అనంతరం నడిరోడ్డుపై కత్తితో గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో మంగళవారం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొరివి మల్లయ్య, బిక్షమమ్మ (40) దంపతులు. బిక్షమమ్మకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో మల్లయ్యతో పాటు అతడి కుటుంబ సభ్యులు తరచూ గొడవ పడుతుండేవారు. ఈ విషయమై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ సైతం జరిగింది.
సూర్యాపేటకు చెందిన ఓ దేశ గురువుతో బిక్షమమ్మ చనువుగా ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఇద్దరినీ మందలించారు. అయినా బిక్షమమ్మ తీరు మార్చుకోకపోవడంతో ఆమె భర్త మల్లయ్య మంగళవారం పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించి మాట్లాడారు. తర్వాత బిక్షమమ్మ నడుచుకుంటూ వెళ్తుండగా.. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి ఆమెను ఢీకొట్టారు.
బిక్షమమ్మ కిందపడిపోవడంతో దుండగులు కారు దిగి తమ వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్, ఎస్సై శ్రీకాంత్‌గౌడ్, క్లూస్‌టీమ్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.