ఏళ్లు గడుస్తున్నా..పోడు రైతులకు పట్టాలివ్వని సర్కార్

ఏళ్లు గడుస్తున్నా..పోడు రైతులకు పట్టాలివ్వని సర్కార్

రాష్ట్రంలో పోడు భూముల సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా తయారైంది. పోడు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సర్వే చేసి రెండేళ్లు పూర్తయినా..ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా పట్టాలు అందివ్వలేదు. 2005 డిసెంబర్ 13 కంటే ముందు నుంచి సాగు చేసుకుంటున్న గిరిజనులకు భూములపై హక్కులు కల్పిస్తామని జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అధికారులు సర్వేలు నిర్వహించారు. కానీ, ఇప్పటి వరకు పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎన్నిలు వచ్చిన ప్రతిసారి పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడం..ఎన్నికలు ముగిశాక మర్చిపోవడం కామన్ అయిపోయింది. 

ఇంకెన్ని రోజులు కాలయాపన చేస్తారు..?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోడూ భూముల సమస్యను పరిష్కరించాలని వేలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 41 వేల మంది రైతులు లక్షా 2వేల ఎకరాలకు హక్కు పత్రాలు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు పోడు భూముల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన చివరి దశకు చేరుకుంది. రాష్ట్ర  ప్రభుత్వం అదేశాలతో గ్రామ సభలు నిర్వహించి హక్కు పత్రాల జారీపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఓవైపు సర్వే జరుగుతున్నా..రైతులు మాత్రం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హడావుడి చేసి..మళ్లీ కాలయాపన చేస్తారా..? సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారా..? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

నల్లమలలో గిరిజనులపై కేసులు

నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో పోడు భూముల వివాదం కొనసాగుతోంది. ఏళ్లుగా పోడు భూములే ఆధారంగా ఎస్సీ, ఎస్టీలు, బీసీ రైతులు జీవనం సాగిస్తున్నారు. మూడు తరాలుగా పోడు భూములను నమ్ముకుని జీవనం సాగిస్తున్న రైతులకు.. ఇప్పటికీ పట్టాలు ఇవ్వకపోవడం, ఫారెస్ట్ అధికారులు భూముల్లో వ్యవసాయం చేయనివ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా రైతులపై అక్రమ కేసులు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోడు వ్యవసాయం చేయనివ్వకపోవడంతో కొందరు పోడు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నల్లమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఆంక్షలు పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు రైతులు, అటవీశాఖ సిబ్బంది మధ్య మళ్లీ పోడు భూముల లొల్లి షురూ అయ్యింది. పోడు భూముల్లో విత్తనాలు విత్తుకునేందుకు రైతులు సిద్దం కావడంతో హరితహారం పేరుతో భూములను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకుని మొక్కలు నాటుతున్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు తీసుకున్నప్పటికీ.. ఏజెన్సీ ప్రాంతంలో రైతులు, ఫారెస్ట్ సిబ్బందికి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. పోడు భూములకు హక్కు పత్రాల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో జాప్యం జరుగుతుండటంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు రైతులు ఆందోళనలు చేస్తున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ పోడు భూముల సమస్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఒక్క ములుగు జిల్లాలోనే 118 గ్రామ పంచాయతీల నుంచి 34 వేల 82 అప్లికేషన్లు వచ్చాయి. ఇప్పటి వరకు 33వేల 35 పూర్తి కాగా.. మరో వెయ్యికిపైగా దరఖాస్తులు అధికారుల పరిశీలనలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 97 శాతం సర్వే పూర్తైంది. ఒక గ్రామంలో సర్వే పూర్తి అయ్యాకే అధికారులు మరో గ్రామానికి వెళ్తున్నారు.