మళ్లీ తండ్రి కాబోతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

మళ్లీ తండ్రి కాబోతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

లండన్‌ : బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ (57) మరోసారి తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య క్యారీ తాను  రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నానని ప్రకటించింది. ఆమె ఆస్పత్రిలో చెకప్ ల కోసం తిరుగుతున్నప్పుడే బ్రిటీష్ మీడియా అనుమానించి తండ్రి కాబోతున్నట్లు కోడై కూసింది. ఈ వార్తలను బోరిస్ జాన్సన్.. ఆయన సతీమణి ఖండించలేదు.. కనీసం తోసిపుచ్చలేదు. గత ఏడాది ఏప్రిల్‌లో క్యారీ మొదటి బిడ్డ విల్ ఫ్రెడ్ కు జన్మనిచ్చారు. మళ్లీ ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఆమె ధృవీకరించింది. 
తాను మరోసారి తల్లిని కావడం ఆనందంగా ఉందని క్యారీ జాన్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన స్నేహితులకు చెప్పింది. ఈ ఏడాది ప్రారంభంలో గర్భస్రావం అయిన నేపధ్యంలో మళ్లీ రెండోసారి గర్భం దాల్చడం ఆనందంగా ఉందని క్యారీ చెప్పినట్లు సన్నిహితుల కథనం.  గర్భస్రావం అయ్యాక చాలా మందికి సంతానోత్పత్తి సమస్యలు వస్తుంటాయి.. తన వరకు అలాంటిదేమీ లేకుండా మళ్లీ గర్భం దాల్చడం సంతోషంగా ఉందని క్యారీ పేర్కొంది. ఇప్పటికే రెండు సార్లు పెళ్లిళ్లు చేసుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్ కు క్యారీ మూడవ భార్య. గత మే నెలలో వెస్ట్ మినిస్టర్ కేథడ్రల్ చర్చిలో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.