ఎగ్జామ్‌లో మంచి మార్కులొస్తే ఆడు తోపురా బై అంటం. ఎన్ని మార్కులొస్తే అంత గొప్పోడంటం. ఇప్పుడు బ్రిటన్ అలాంటి తోపులకే తొవ్వ ఓపెన్ చేసింది. మంచి ‘పాయింట్లు’ తెచ్చుకుంటే తప్ప వీసా ఇయ్యం అంటోంది. అవును, స్కిల్ ఉన్నోళ్లకు బాటలు పరుస్తూ, లేనోళ్లకు గేట్లు మూసేస్తూ కొత్త వీసా విధానాన్ని తీసుకొచ్చింది ఆ దేశం. ఆస్ట్రేలియాలాగే పాయింట్లను బట్టి వీసానిచ్చే కొత్త పద్ధతికి బ్రిటన్ ఓకే స్టాంప్ ఏసేసింది. బుధవారం భారత సంతతికి చెందిన బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్ ఆ సరికొత్త వీసా విధానాన్ని ప్రారంభించారు. వచ్చే ఏడాది, అంటే 2021 జనవరి 1 నుంచి ఈ కొత్త పాయింట్స్ బేస్డ్ వీసా విధానం అమల్లోకి రాబోతోంది.
70 పాయింట్లు
ఎన్నికల టైంలో బోరిస్ జాన్సన్ పార్టీ ప్రత్యేకంగా ఈ పాయింట్స్ బేస్డ్ ఇమిగ్రేషన్ సిస్టమ్‌పైనే హామీలిచ్చింది. ఆ హామీని నిలబెట్టుకుంది. ఈ కొత్త పద్ధతిలో బ్రిటన్‌లో కొలువు చేయాలనుకునేటోళ్లు 70 పాయింట్లు సాధించాలి. ఇంగ్లీష్ బాగా మాట్లాడడం, డిగ్రీ పట్టా, జాబ్ ఆఫర్, కంపెనీ ఇచ్చే జీతం, కొరత ఉన్న రంగాల్లో జాబ్స్ వంటి వాటికి పాయింట్స్ ఇస్తారు. ఇప్పటిదాకా టయర్ 2 స్కీమ్ కింద స్కిల్డ్ వర్కర్లకు డిగ్రీ, ఏడాది జీతం 30 వేల పౌండ్లుగా ఉండేది. కానీ, ఇప్పుడు ఆ జీతాన్ని 25,600 పౌండ్లకు తగ్గించింది బోరిస్ సర్కార్. వాటి ఆధారంగానే బ్రిటన్‌లో జాబ్ చేయాలనుకునేవాళ్లకు పాయింట్లు కేటాయిస్తారు. ఉదాహరణకు ఓ యూనివర్సిటీ రీసెర్చర్ పోస్టుకు అప్లై చేశారనుకుందాం. అందులో జాబ్ ఆఫర్‌కు 20 పాయింట్లు, స్కిల్ లెవెల్‌కు 20, ఇంగ్లీష్ స్పీకింగ్‌కు 10, సంబంధిత స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్) కోర్సు పీహెచ్‌డీకి 20 పాయింట్లు, జీతానికి 0 పాయింట్లు (25,600 వేల పౌండ్ల కన్నా తక్కువుంటే).. మొత్తంగా 70 పాయింట్లు కేటాయిస్తారు. ఆ పాయింట్లను బట్టి వీసా ఇస్తారు. అయితే, ఉద్యోగాల కొరత ఉన్న రంగంలో జాబ్ కావాలంటే కనీస జీతం 20,480 పౌండ్లుండాలని రూల్ పెట్టారు. ఇక, ఇప్పటిదాకా ఇన్ని వీసాలు మాత్రమే ఇస్తామంటూ బ్రిటన్ ఓ పరిమితి పెట్టింది. ఆ పరిమితిని ఇప్పుడు బ్రిటన్ సర్కార్ ఎత్తేసింది. స్కిల్డ్ లేబర్‌ను వీలైనంత ఎక్కువమందిని తీసుకునేందుకు అది ఉపయోగపడుతుంది. స్టూడెంట్ వీసాకూ సేమ్ రూల్స్ వర్తిస్తాయని బ్రిటన్ హోం శాఖ పేర్కొంది. సీటు వచ్చినట్టు కాలేజీ నుంచి ఆఫర్ లెటర్, ఆర్థిక స్థోమత, ఇంగ్లీష్ మాట్లాడే నేర్పు వంటి వాటి ఆధారంగా పాయింట్లు కేటాయించనుంది.
ఈయూ వాళ్లకూ ‘ఫ్రీ రోడ్’ బంద్
మొన్నటిదాకా బ్రిటన్ యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో భాగంగా ఉండేది. జనవరి 31 నుంచి ఆ బంధానికి బైబై చెప్పేసి వేరు కాపురం పెట్టేసింది. దీంతో ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త విధానం ఈయూలోని మిగతా దేశాలకూ వర్తించనుంది. ప్రస్తుతమున్న ఈయూ వర్క్‌ఫోర్స్‌లో 70 శాతం మందికి తగిన అర్హతలు లేవని బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్ చెప్పారు. ఈ కొత్త విధానంతో భవిష్యత్తులో అది భారీగా తగ్గుతుందని ఆమె అన్నారు. ఈయూ, నాన్ఈయూ దేశాలన్నింటినీ సమానంగా చూసేందుకే ఈ కొత్త వలస రూల్స్ తీసుకొచ్చినట్టు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత ఈయూలోని దేశాలన్నీ కూడా కొత్త వీసా రూల్స్‌ను పాటించాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఆ దేశాలకు చెందిన వాళ్లు బ్రిటన్ రావాలంటే వీసా అవసరం ఉండేది కాదు. దాని వల్ల స్కిల్ లేనోళ్లూ ఎక్కువగా బ్రిటన్‌లో జాబ్స్ పొందుతున్నారన్న ఆరోపణ ఉండేది. ఈ కొత్త విధానంతో దానికి చెక్ పెట్టొచ్చని ప్రీతి పటేల్ చెబుతున్నారు. గత శుక్రవారం నుంచి అమలవుతున్న గ్లోబల్ ట్యాలెంట్ స్కీమ్కూడా ఈయూ దేశాలకు వర్తిస్తుందన్నారు.
మరి, చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్లూ..
అయితే, ఈయూ నుంచి చిన్న చిన్న పనులు చేసుకునేందుకు చాలా మంది లో స్కిల్డ్ లేబర్ వస్తుంటారు. అలాంటోళ్ల వీసాలకు కత్తెర వేసింది బ్రిటన్ సర్కారు. రైతు కూలీలు, కేటరింగ్, నర్సింగ్ వంటి రంగాల్లో సిబ్బందిని నియమించుకోవడం కొత్త వీసా విధానంతో కష్టం కానుంది. అయితే, బ్రిటన్ సర్కారు మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఇప్పటికే ఈయూకు చెందిన 32 లక్షల మంది బ్రిటన్‌లో ఉండేందుకు దరఖాస్తు చేసుకున్నారని, లేబర్ డిమాండ్స్‌కు తగ్గట్టు వాళ్లు సరిపోతారని చెబుతోంది. అంతేగాకుండా సీజనల్ వ్యవసాయ కూలీలకు సంబంధించి ఇప్పటిదాకా ఉన్న 2,500 లిమిట్‌ను 10 వేలకు పెంచినట్టు చెప్పింది. 20 వేల మంది యంగ్‌స్టర్స్ దేశానికి వచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపింది. లో స్కిల్డ్ లేబర్‌కు సంబంధించి కార్పెంట్రీ, ప్లాస్టరింగ్, చైల్డ్మైనింగ్ వంటి రంగాలను కొత్తగా చేర్చింది.
మనోళ్లకు వరమే
ఈ కొత్త వీసా విధానంతో ఎక్కువగా లాభపడేది ఇండియన్లేనని నిపుణులు చెబుతున్నారు. శాలరీ లిమిట్‌ను తగ్గించడం వల్ల కచ్చితంగా ఇండియన్లు లాభపడతారని ఈపీజీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రతీక్దత్తానీ చెప్పారు. స్కిల్ ఉన్న ఇండియన్లకు ఇది వరంగా మారుతుందన్నారు. ఇప్పటిదాకా వొకేషనల్ స్కిల్స్‌కు సంబంధించి బ్రిటన్ ఈస్టర్న్ యూరోపియన్లపైనే ఆధారపడిందని, ఇప్పుడు కొత్త సిస్టమ్‌తో దానికి తెరపడుతుందని చెబుతున్నారు. బ్రిటన్‌లో చదివే స్టూడెంట్లకు ఈ శాలరీ లిమిట్ వరం అని, వర్క్ వీసాకు అప్లై చేసుకునేటప్పుడు అది బాగా పనికొస్తుందని ఇండియన్ నేషనల్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమిత్ తివారీ చెప్పారు. ప్రస్తుతం దాదాపు 14 లక్షల మంది ఇండియన్లు బ్రిటన్‌లో ఉంటున్నారు. ఈ కొత్త విధానాలతో అక్కడికి మనోళ్ల తాకిడి పెరిగే అవకాశాలూ ఉన్నాయి.
