U19 World Cup 2024 Final: పెద్దొళ్ల బాటలోనే చిన్నోళ్లు.. ఫైనల్‌లో టీమిండియా ఓటమి

U19 World Cup 2024 Final: పెద్దొళ్ల బాటలోనే చిన్నోళ్లు.. ఫైనల్‌లో టీమిండియా ఓటమి

2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమి.. ప్రత్యర్థి ఆస్ట్రేలియా, 2024 అండర్-19 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమి.. ప్రత్యర్థి ఆస్ట్రేలియా.. పెద్దొళ్ల బాటలోనే చిన్నోళ్లు అడుగులు వేశారు. గెలిచి గత పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటారు అనుకుంటే.. కనీసం పోరాడకుండానే ఓటమిని అంగీకరించారు. బెనోని వేదికగా ఆసీస్‌తో జరిగిన ఫైనల్‌లో భారత యువ జట్టు 74 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 

ఆదుకున్న పంజాబ్ కుర్రాడు

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. 99 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్ జట్టును భారత మూలాలున్న పంజాబ్ కుర్రాడు హర్జాస్ సింగ్ ఆదుకున్నాడు. 64 బంతులాడిన ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌.. 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. ఇతనికి తోడు వీబ్‌జెన్(48), డిక్సన్(42), ఆలివర్ పీక్(41) పరుగులతో రాణించారు. దీంతో ఆసీస్.. భారత్ ముందు ధీటైన లక్ష్యాన్ని నిర్ధేశించింది.

ఆదర్శ్ సింగ్ ఒంటరి పోరాటం

అనంతరం 254 పరుగుల ఛేదనలో భారత బ్యాటర్లు 174 పరుగులకే కుప్పకూలారు. ఆసీస్ పేసర్ల ధాటిగా పరుగులు చేయడానికి నానా అవస్థలు పడ్డారు. 47 పరుగులు చేసిన ఆదర్శ్ సింగ్ టాప్ స్కోరర్. భారత్ ఇన్నింగ్స్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఆది నుంచి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే వచ్చింది. ఆర్షిన్ కులకర్ణి (3), ముషీర్ ఖాన్(22), ఉదయ్ సహారన్(8), సచిన్ దాస్(9),ప్రియాన్షు మొలియా(8), అవినీష్(0) విఫలమయ్యారు. ఆఖరిలో మురుగన్ అభిషేక్ 42 పరుగులు చేసి భారత్ పరువు నిలబెట్టాడు. ఆసీస్ బౌలర్లలో మెక్‌మిల్లన్, బార్డ్‌మాన్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. చార్లీ ఆండర్సన్ 2, విడ్లర్, స్ట్రేకర్ చెరో వికెట్  తీసుకున్నారు.