ప్రధాని మోదీకి స్పెషల్ వెజ్ విందు.. ప్రిపేర్ చేయించిన దుబాయ్ రాజు

ప్రధాని మోదీకి స్పెషల్ వెజ్ విందు..  ప్రిపేర్ చేయించిన దుబాయ్ రాజు

యూఏఈ లో ప్రధాని మోదీ పర్యటన విజయవంతమైంది. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ జాయెద్ అల్ నహ్యాన్.. మోదీ కోసం ఏర్పాటు చేసిన ఫుడ్ మెను ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆయన ప్రధాని కోసం ప్రత్యేకంగా వెజ్ మెనూ ఏర్పాటు చేయించారు. కస్ర్-అల్-వతన్ అధ్యక్ష భవనంలో జరిగిన ఈ విందులో హరీస్ (గోధుమలు), ఖర్జూరం సలాడ్‌తో పాటు స్థానికంగా లభించే ఆర్గానిక్ కూరగాయలు కూడా ఉన్నాయి. 

స్టార్టర్స్ కోసం, అతిథులకు రుచికరమైన మసాలా సాస్‌లో కూరగాయలను కాల్చి అందించారు.  అక్కడ ఫేమస్ అయిన  నల్ల కాయధాన్యాలు,  గోధుమలు, తందూరి కాలీఫ్లవర్, క్యారెట్‌ తదితర వంటకాలను వహ్వా అనేలా వండించారు.  ఫినిషింగ్ టచ్ గా మోదీ కోసం డెజర్ట్ లను ప్రిపేర్ చేయించారు.  అన్ని వంటకాలు వెజిటెబుల్ ఆయిల్స్ తో తయారు చేయడం విశేషం.

పర్యటన ఇందుకే..

ఒకరోజు అధికారిక పర్యటన కోసం అబుదాబి వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ బహుముఖ ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలోపేతం చేసేందుకు యుఏఈ అధ్యక్షుడితో చర్చలు జరిపారు. గతేడాది సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత భారత్‌, యూఏఈల మధ్య వాణిజ్యం 20 శాతం పుంజుకుందని ప్రధాని  అన్నారు. “ఇరు దేశాల మధ్య  ద్వైపాక్షిక వాణిజ్యం 20 శాతం పెరిగింది. 

85 బిలియన్‌ డాలర్ల వాణిజ్యాన్ని సాధించాం. త్వరలో 100 బిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుంటాం" అని ఆయన చెప్పారు. అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో తనకున్న  బంధాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. 

యూఏఈ దేశాధ్యక్షుడు మాట్లాడుతూ..  “మా మధ్య సంబంధాలు విస్తరించడానికి మూల కారణం ప్రధాని మోదీ. భారత్లోని ప్రతి వ్యక్తి మిమ్మల్ని నిజమైన స్నేహితుడిగా చూస్తారు ”అని అన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, ఆహార భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, ఫిన్‌టెక్, రక్షణ, భద్రత తదితర రంగాల్లో ఇండియా, యూఏఈ బలమైన సంబంధాలు కలిగి ఉంది.