పబ్జీ పిచ్చి ఎంతలా ముదిరిపోతోందో చెప్పే ఘటనలు ఇటీవలి కాలంలో బయటకొస్తున్నాయి. పెళ్లి అవుతున్నా ఎవరినీ పట్టించుకోకుండా పబ్జీ ఆడుకున్న పెళ్లికొడుకు కథ చదివాం. ఇప్పుడు అలాంటిదే మరో ఘటన జరిగింది. కాకపోతే అక్కడ పెళ్లి.. ఇక్కడ పెటాకులు అంతే తేడా. పబ్జీ ఆడొద్దు అన్న పాపానికి భర్తకు విడాకులిచ్చేయడానికి రెడీ అయిందో భార్య. ఈ ఘటన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగింది. పాపం భార్య ఎక్కడ ఆ గేమ్‌కు బానిసైపోతుందోనని భయపడిన ఆ భర్తను రివర్స్‌లో భయపెట్టేసింది ఆ భార్యామణి. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన హక్కులను కాలరాస్తున్నాడని గగ్గోలు పెట్టింది. గేమ్ ఆడుకోవడం తన హక్కు అని, ఆడకుండా భర్త అడ్డుపడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బయటి వాళ్లకు తన స్టేటస్ తెలియకుండా చాట్ ఆప్షన్‌ను ఆఫ్ చేసి ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతోనే గేమ్ ఆడుతున్నానని వాపోయింది. కానీ, ఆడనివ్వకుండా తన ప్రాథమిక హక్కులకు భర్త భంగం కలిగించాడని మొరపెట్టుకుంది. విడాకులిప్పించాలని వేడుకుంది. అయితే, భర్తను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించిన పోలీసుల.. అతడి వివరణనూ తీసుకున్నారు. అయ్యబాబోయ్ దీంతో హక్కులకు సంబంధం లేదండి అన్నాడా భర్త. ఎక్కడ గేమ్‌కు అడిక్ట్ అయ్యి, ఇంటి బాధ్యతలను గాలికొదిలేస్తుందోనన్న భయంతోనే ఆడొద్దని చెప్పానని తన గోడు చెప్పుకున్నాడు. కుటుంబాన్ని మంచిగ ఉంచడం కోసమే అలా చేశానన్నాడు. కానీ, ఇలా తన భార్య విడాకులు అడుగుతుందనుకోలేదన్నాడు. అయినా కూడా తనకు విడాకులే కావాలని మొండి పట్టు పడుతోంది ఆ భార్య. మరి, ఈ కథ ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూద్దాం.
