ఉబర్ డ్రైవర్ నిద్ర.. 150 కిలోమీటర్లు కారు నడిపిన యువతి

ఉబర్ డ్రైవర్ నిద్ర.. 150 కిలోమీటర్లు కారు నడిపిన యువతి

సాధారణంగా మనం క్యాబ్ లో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్ కారు నడుపుతుంటే మనకు వెనుక సీట్లో కూర్చొని నిద్రపోతాం. కానీ ముంబయిలో జరిగిన ఓ సంఘటనలో మాత్రం క్యాబ్ డ్రైవర్ నిద్రపోతుంటే ప్రయాణికురాలే కారును నడిపింది. నిద్రమత్తులో ఉన్న ఆ డ్రైవర్… కారు నడపలేక ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొట్టబోతుండటం చూసి భయపడి తానే స్టీరింగ్ ముందు కూర్చుంది. అలా 150 కి.మీ.లు డ్రైవ్ చేసింది. గత నెల ఫిబ్రవరి 21 న ఈ ఘటన జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ముంబయికి చెందిన తేజస్విని దివ్య నాయక్‌ ఇటీవల పుణె నుండి ముంబై లోని తన ఇంటికి వచ్చేందుకు ఉబెర్‌ సంస్థకు చెందిన ఓ క్యాబ్‌ బుక్‌ చేసుకుంది. ఆమె కారు ఎక్కినప్పటి నుండి కూడా ఆ డ్రైవర్‌ ఫోన్‌లో మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేస్తుండడం చూసి ఫోన్ ఆపేసి డ్రైవ్‌ చేయాలని కోరింది. ఆమె మాటలు విని  ఫోన్ పెట్టేసిన డ్రైవర్  ఆ తర్వాత కొద్ది సేపటికే నిద్ర లోకి జారుకున్నాడు. అలా కొంతదూరం వెళ్లిన తర్వాత ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించబోయి ఢివైడర్ ను ఢికొట్టాడు. ఇది గమనించిన దివ్య.. వెన్ను నొప్పితో బాధపడుతున్నప్పటికీ..  తానే డ్రైవింగ్ చేస్తానని, డ్రైవర్ ని నిద్రపొమ్మని చెప్పింది.

కానీ దివ్య డ్రైవ్ చేసే సమయంలో ఆ డ్రైవర్ నిద్రపోకుండా ఆమె  డ్రైవింగ్ స్కిల్స్ ను మెచ్చుకుంటూ కబుర్లు చెప్పసాగాడు. అలా మళ్లి నిద్రలోకి జారుకున్న తర్వాత దివ్య అతను నిద్రపోతున్న ఫొటోలను, వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి ఉబెర్‌ సంస్థకు ట్యాగ్ చేసింది. మరి కాసేపట్లో ముంబై చేరుకుంటామనగా ఆ క్యాబ్ డ్రైవర్ నిద్రలేచి కారు నడిపినట్లు దివ్య ఆ పోస్టు లో తెలిపింది. దీనిపై స్పందించిన ఉబెర్‌ సంస్థ, జరిగిన ఘటన బాధాకరమని.. ఆ డ్రైవర్‌ని వెంటనే విధుల నుంచి తొలగిస్తామని చెప్పింది.

Uber driver falls asleep at wheel, forces woman to drive from Pune to Mumbai