ఉద్ధవ్ ఠాక్రేకు గుణపాఠం చెప్పాల్సిందే..

ఉద్ధవ్ ఠాక్రేకు గుణపాఠం చెప్పాల్సిందే..

శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బీజేపీకి ద్రోహం చేశారని.. ఆయనకు గుణపాఠం చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాజకీయాల్లో దేన్నైనా సహించగలం కానీ నమ్మద్రోహాన్ని మాత్రం సహించలేమని ముంబయిలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో చెప్పారు. శివసేన కూలడంతో పాటు దాన్ని తర్వాత జరిగిన పరిణామాలకు ఉద్ధవ్ ఠాక్రేనే కారణమన్నారు. 

ఠాక్రే బీజేపీకే కాకుండా నమ్మిన సిద్ధాంతాలకు కూడా ద్రోహం చేశాడని అమిత్ షా ఆరోపించారు. అంతేకాకుండా మహారాష్ట్ర ప్రజలను ఘోరంగా అవమానించారని విమర్శించారు. తన దురాశే అతని పార్టీలోని ఒక వర్గం దూరం అవ్వడానికి కారణమైందన్నారు. తాము ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఉద్దవ్ కు ఎప్పుడు చెప్పలేదన్నారు. తాము తలుపులు మూసి రాజకీయాలు చేయం అని.. ఏదైనా బహిరంగంగానే చేస్తామన్నారు.  

రాజకీయాలలో నమ్మద్రోహం చేసినవారికి శిక్ష పడాల్సిందేనని అమిత్ షా వ్యాఖ్యానించారు. మోడీ మార్గదర్శకత్వంలో బృహన్ ముంబై కార్పోరేషన్ ఎన్నికల్లో 150 సీట్లు గెలవడం తమ లక్ష్యమని చెప్పారు. ప్రజలంతా మోడీ వెంటే ఉన్నారని..తప్పకుండా అనుకున్న సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.